AP

పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంలో కలకలం: లోపలికి చొరబడి కాన్వాయ్ వాహనాలను ధ్వంసం చేసిన వ్యక్తి!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారి మంగళగిరి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన నీలాద్రి అనే వ్యక్తి ఆటోలో నేరుగా కార్యాలయంలోకి చొరబడి వీరంగం సృష్టించాడు. సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగి, అక్కడే ఉన్న కర్రతో పవన్ కల్యాణ్ కాన్వాయ్‌లోని రెండు వాహనాల అద్దాలను పగులగొట్టి ధ్వంసం చేశాడు. వెంటనే అప్రమత్తమైన జనసేన కార్యాలయ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు నీలాద్రి ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చినట్లు తెలిసింది. అయితే, విచారణ సమయంలో అతడు పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో అతడి మానసిక స్థితిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వంటి అత్యంత భద్రత ఉండాల్సిన చోట ఇలాంటి ఘటన జరగడం జనసేన కార్యకర్తలలో ఆందోళన కలిగిస్తోంది. గతంలో కూడా ఇక్కడ డ్రోన్ల సంచారం కలకలం రేపిన విషయాన్ని భద్రతా సిబ్బంది గుర్తు చేస్తున్నారు.

ఈ ఘటనను ప్రభుత్వం మరియు పోలీస్ యంత్రాంగం సీరియస్‌గా తీసుకున్నాయి. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా నిందితుడిని విచారించారు. ఇది కేవలం మతిస్థిమితం లేక చేసిన పనా? లేక దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్ర లేదా ఉద్దేశపూర్వక ప్రేరేపణ ఉందా? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ గారి భద్రత దృష్ట్యా ఈ ఘటనపై సమగ్ర నివేదికను కోరడం జరిగింది.