AP

అది ఆలయాల విధ్వంసం కాదు.. పునర్నిర్మాణం: ఫేక్ ప్రచారాలపై మంత్రి నారా లోకేశ్ ఫైర్!

ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష వైసీపీ కావాలనే కులం, మతం మరియు ప్రాంతం పేరుతో ప్రజల మధ్య అలజడి రేపేందుకు ఫేక్ ముఠాలతో అసత్య ప్రచారాలు చేయిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ‘ఫ్యాక్ట్ చెక్’ నివేదికను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, ప్రజలు ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయానికి సంబంధించి జరుగుతున్న ప్రచారంపై లోకేశ్ స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం ఆ ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని, గర్భాలయం, విమానగోపురం మరియు అర్థ మండపం రాతి పనులు ఇప్పటికే 60 శాతం పూర్తయ్యాయని తెలిపారు. దేవస్థాన వైదిక కమిటీ తీర్మానం మరియు ఆగమ సలహాదారుల సూచనల మేరకే, ఫిబ్రవరి 28న శాస్త్రోక్తంగా పాత ఆలయాన్ని తొలగించారని వివరించారు. ఈ పనులకు సంబంధించిన వీడియోలను వక్రీకరించి ఆలయాల విధ్వంసంగా చిత్రీకరించడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు.

ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న “పేటియం బ్యాచ్” తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మంత్రి హెచ్చరించారు. అభివృద్ధి పనులను అడ్డుకోవడమే కాకుండా, ఇలాంటి సున్నితమైన అంశాలపై విషం చిమ్మడం సరికాదని హితవు పలికారు. ఆలయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, భక్తులు వాస్తవాలను గ్రహించాలని కోరారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.