AP

ఏపీ పోర్టుల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష: రామాయపట్నం – కడప రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయి కార్గో కారిడార్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం సచివాలయంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పురోగతిపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయపట్నం పోర్టు నుంచి కడప స్టీల్ ప్లాంట్ వరకు ప్రత్యేక రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని సీఎం వెల్లడించారు. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులలో కార్యకలాపాలను వేగవంతం చేసి, 2026 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని పోర్టుల ద్వారా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచి సరుకు రవాణా జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రామాయపట్నం పోర్టులో బీపీసీఎల్ (BPCL) రిఫైనరీ ఏర్పాటు కానుండటంతో, ఇది భవిష్యత్తులో ప్రధాన కంటైనర్ హబ్‌గా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఉండేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని, దీనివల్ల స్థానికంగా పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చెంది ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని స్పష్టం చేశారు.

ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ నౌకాయాన రంగం ఇబ్బందుల్లో ఉందని, ఈ తరుణంలో భారత్ తూర్పు తీరంలోని పోర్టులే సురక్షితమనే భావన ప్రపంచవ్యాప్తంగా బలపడుతోందని సీఎం అన్నారు. ఈ అవకాశాన్ని ఏపీ అందిపుచ్చుకోవాలని, రాష్ట్ర పోర్టులను కార్గో రవాణాలో ‘గేమ్ ఛేంజర్’గా మార్చాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రెండో దశలో చేపడుతున్న బుడిగట్లపాలెం, పూడిమడక వంటి ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.