వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నేడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ కేడర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీకి ‘గుండె ధైర్యం’ అనేది ఒక ట్రేడ్ మార్క్ అని, విలువలు మరియు విశ్వసనీయతే తమ పార్టీకి అసలైన పునాదులని పేర్కొన్నారు. తమ ఐదేళ్ల పాలనలో కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట తప్పకుండా సంక్షేమ క్యాలెండర్ ప్రకారం పథకాలను అమలు చేశామని ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుత చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ హయాంలో సుమారు రూ. 2.7 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరవేశామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే అప్పులు రూ. 3.30 లక్షల కోట్లు దాటాయని విమర్శించారు. “జగన్ చేయగలిగింది బాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?” అనే చర్చ ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోనూ జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ‘దోచుకో.. పంచుకో.. తినుకో..’ అనే విధానం సాగుతోందని జగన్ ఆరోపించారు. అమరావతి పనుల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని, కేవలం అవినీతి కోసమే వారు అధికారంలో ఉన్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలను గాలికొదిలేశారని, ప్రజలకు రావాల్సిన ఆదాయం రావడం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి ముఖ్య నేతలు పాల్గొని పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.

