AP

త్వరలోనే విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం: పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వెల్లడి

విశాఖపట్నం రైల్వే జోన్ కార్యకలాపాలను వీఎంఆర్డీఏ (VMRDA)కు చెందిన ‘ది డెక్’ భవనం నుండి త్వరలోనే ప్రారంభించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం కేంద్రం ఇప్పటికే రూ.106.89 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. విశాఖలోని ముడసర్లోవ వద్ద ఏపీ ప్రభుత్వం కేటాయించిన 52.2 ఎకరాల భూమిలో ప్రధాన కార్యాలయ భవన పునాది పనులు పూర్తయ్యాయని, త్వరలోనే జనరల్ మేనేజర్ మరియు ఇతర అధికారుల నియామకం కూడా జరుగుతుందని ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధి కోసం కేంద్రం రికార్డు స్థాయిలో నిధులు కేటాయిస్తోందని మంత్రి తెలిపారు. 2009-14 మధ్య ఏటా సగటున రూ.886 కోట్లు మాత్రమే కేటాయించగా, 2025-26 బడ్జెట్‌లో ఏకంగా రూ.9,417 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త లైన్లు, డబ్లింగ్ పనులు సహా మొత్తం రూ.70,232 కోట్ల విలువైన 39 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో రైల్వే ట్రాకుల నిర్మాణ వేగం పెరిగిందని, ప్రతి ఏటా సగటున 143 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్ పనులు పూర్తవుతున్నాయని ఆయన గణాంకాలతో వివరించారు.

రాష్ట్ర రాజధాని అమరావతికి రైల్వే అనుసంధానంపై కూడా మంత్రి స్పష్టత ఇచ్చారు. అమరావతి రైల్వే లైన్ నిర్మాణం కోసం రూ.2,047 కోట్లు మంజూరు చేశామని, ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. వీటితో పాటు విజయవాడ – గూడూరు మూడో లైన్ పనులు, గుంతకల్ – గుంటూరు డబ్లింగ్ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. విశాఖ జోన్ కార్యకలాపాలు తాత్కాలిక భవనం నుంచి ప్రారంభం కానుండటం ఏపీ రైల్వే ప్రయాణికులకు ఒక సానుకూల సంకేతంగా నిలుస్తోంది.