సీమలో సోలార్ కాంతులు.
……………………………….
*రానున్న కొత్త ప్రాజెక్టులు..
మట్టి మనిషికి మంచి రోజులు.
*బీడు పడ్డ రైతు పొలాల్లో విద్యుత్ వెలుగులు.
*అన్నదాతల్లో చిగురిస్తున్న ఆశలు.
…………………………………
ఒకప్పుడు రత్నాలను రాశులుగా పోసి మురిసి పోయిన రాయలసీమను కరువు రక్కసి కౌగిలించుకుంది. ప్రతీ ఏటా పచ్చి, వట్టి కరువు కన్నీరు మిగిల్చింది.రైతు కళ్లెదుటే పొలాలు బీళ్లు గా మారాయి. కన్న బిడ్డల్లా పెంచుకున్న మూగజీవాలు మేత లేక విలవిల లాడుతున్నాయి.ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. ఉన్న పొలం పండక, కౌలుకు ఎవరూ రాక, పొలాలు చేసుకోక బీళ్లు గా మారిన రైతు పొలాలకు ఇక మంచి రోజులు రాబోతున్నాయి. వికసిత్ భారత్ లో భాగంగా కొత్త ప్రాజెక్టులు రానున్నాయి. కరువు బారిన పడ్డ సీమ నేలను ముద్దాడుతున్నాయి. కర్నూలు జిల్లాలో కరువు రక్కసి కాపురం ఉండే పత్తికొండ, ఆలూరు, అనంతపురం జిల్లాలో ఉరవకొండ,రాయదుర్గం, కడప జిల్లాలో కడప, పులివెందుల ఇలా అనేక ప్రాంతాల్లో సోలార్ కంపెనీలు బీళ్ల భూములను కౌలుకు తీసుకొని రైతన్నకు బాసటగా నిలవనున్నాయి. ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో పంటలు పండక ఉన్న భూములను వదిలేసి వలస పోతున్న రైతన్నకు సోలార్, విండో ప్రాజెక్టులు కాస్త ఊపిరి పోస్తున్నాయి. రైతుల భూములను కౌలుకు తీసుకుని ఆ భూముల్లో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అడుగులు వేస్తున్నాయి. ఒకవైపు రైతులకు మేలు… మరోవైపు భవిష్యత్ తరాలకు విద్యుత్ ఉత్పత్తి వెలుగులు దీంతో భారతా వనిలో విద్యుత్ కాంతి రేఖలు వికసించనున్నాయి. వలసలు పోకుండా నివారించేందుకు రైతు పొలాలను కేవలం కౌలుకు మాత్రమే తీసుకుని ఏడాది పాటు రైతులకు సరిపడే డబ్బులు అందించి కంపెనీ యాజమాన్యాలు ఆదుకోనున్నాయి. సోలార్, విండో కంపెనీలు రావడం వల్ల సీమలో విళయ తాండవం చేసే కరువు రక్కసి కనుమరుగు కానుంది. నిరుద్యోగ యువతకు ఉపాధితో పాటు రైతన్నలకు ఎంతో మేలు జరగనుంది. ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వనరులు పెరగడంతో పాటు రైతుల జీవన విధానంలోనూ అభివృద్ధి అడుగు పడనుంది.

