ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో రాజధాని అమరావతికి సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అమరావతికి చట్టబద్ధమైన హోదా కల్పించేందుకు ఉద్దేశించిన తీర్మానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని కోసం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్-5ను సవరించి, కొత్త రాజధానిగా ‘అమరావతి’ పేరును అధికారికంగా చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నెల 28న జరగనున్న ప్రత్యేక శాసనసభ సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం తెలుపనున్నారు. అనంతరం, పునర్విభజన చట్టంలో సవరణల కోసం ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. ఈ చర్యతో అమరావతి రాజధానికి చట్టపరమైన భద్రత లభించనుంది.
ఈ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. రాష్ట్రంలో కొత్తగా 96 జూనియర్, సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, నీరుకొండలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి 60 మీటర్ల ఎత్తు వరకు అకడమిక్ భవనాల నిర్మాణానికి అనుమతి మంజూరు చేశారు.
వీటితో పాటు, ఖనిజ లీజుల కేటాయింపులో వడ్డెర సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ప్రీమియం, సీనరేజ్ ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పించాలని నిర్ణయించారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ మాఫీ చేసే ప్రతిపాదనకు, కుప్పం బాలికల పాఠశాలలో కొత్త పోస్టుల మంజూరుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

