చెన్నై: తన కుమార్తెతోపాటు తాను కూడా చనిపోయానని సినీ నటుడు విజయ్ ఆంటోనీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె(16) ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
చెన్నైలోని తమ నివాసంలో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ క్రమంలో విజయ్ ఆంటోనీ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్టు చేశారు.
తన కుమార్తెతోపాటు తానూ చనిపోయానని భావోద్వేగానికి గురయ్యారు. ఇక నుంచి తాను చేయబోయే ప్రతి మంచి పని ఆమె పేరున చేస్తానని.. దీంతో ఆమెతో కలిసి ఉన్నట్లు ఉంటుందని విజయ్ ఆంటోనీ వ్యాఖ్యానించారు. తన కుమార్తెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదనకు గురయ్యారు.
‘నా పెద్ద కుమార్తె ఎంతో దయగలది. అంతకుమించి ధైర్యవంతురాలు. కులం, మతం, బాధ, అసూయ, పేదరికం, ద్వేషపూరిత వాతావరణం లేని ప్రశాంతమైన ప్రదేశంలోకి వెళ్లిపోయింది. ఆమె ఇప్పటికీ నాతో మాట్లాడుతోంది. తనతోపాటే నేనూ చనిపోయాను. ఇక నుంచి నేను చేసే సేవా కార్యక్రమాలను ఆమె పేరుతోనే ప్రారంభిస్తాను’ అని విజయ్ ఆంటోనీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
విజయ్ చేసిన ట్వీట్ చూసిన ఆయన అభిమానులు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఆ దేవుడు మీకు మనోబలాన్ని ఇవ్వాలి.. ఆమె ఆత్మకు శాంతి కలగాలి అని నెటిజన్లు ఆకాంక్షించారు. మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుందని మరొకరు వ్యాఖ్యానించారు.
సెప్టెంబర్ 19వ తేదీన తెల్లవారుజామున 3 గంటల సమయంలో విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయాన్నే ఇంట్లో వాళ్లు చూసి.. వెంనటే ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తీవ్రమైన ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని ఓ ప్రైవేటు విద్యాలయంలో ఆమె ఇంటర్ చదువుతోంది. విజయ్-నిర్మాత ఫాతిమా దంపతులకు ఆమె మొదటి కుమార్తె. వీరికి ఇద్దరు కుమార్తెలు. 2006లో ఫాతిమాను విజయ్ వివాహం చేసుకున్నారు.