CINEMA

‘ఆర్‌సీ 16’ సినిమా క‌థ ఇదేనా..?

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ‘ఆర్‌సీ 16’ (వ‌ర్కింగ్ టైటిల్‌). ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. చ‌ర‌ణ్‌తో పాటు చిత్రంలోని ఇత‌ర ప్ర‌ధాన తారా‌గ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను బుచ్చిబాబు తెర‌కెక్కిస్తున్నారు.

 

అయితే, ఈ చిత్రం క‌థ ఇదేనంటూ ఇప్ప‌టికే నెట్టింట ఊహ‌గానాలతో కూడిన‌ ఎన్నో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ సినిమాను కోడి రామ్మూర్తి జీవిత క‌థ ఆధారంగా తీస్తున్నార‌ని తొలుత ప్ర‌చారం కూడా న‌డిచిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ‘ఆర్‌సీ 16’ క‌థ గురించి సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్నవేలు ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా హింట్ ఇచ్చారు.

 

“రాత్రుళ్లు షూటింగ్‌, ఫ్ల‌డ్ లైట్లు, ప‌వ‌ర్ క్రికెట్, విచిత్ర కోణాలు” అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు. దీంతో రెండు ఊళ్ల మ‌ధ్య జ‌రిగే క్రికెట్ ఆధారంగా సినిమా క‌థ ఉంటుంద‌ని అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. ఇక నెగెటివ్ కెమెరా, ఫిల్మ్ కెమెరాలతో కొంత పార్ట్ షూటింగ్ చేస్తున్నామని రత్నవేలు ఆల్రెడీ లీక్ ఇచ్చారు. ఆ సీన్లు ఎంతో రా గా, సహజత్వానికి దగ్గరగా ఉంటాయని సినిమాటోగ్రాఫ‌ర్ చెప్పిన సంగతి తెలిసిందే.

 

‘దేవర’తో టాలీవుడ్ లో అరంగేట్రం చేసిన‌ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివ‌రాజ్‌ కుమార్ ప‌వ‌ర్‌ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. అలాగే జ‌గ‌ప‌తి బాబు కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ‌మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.