విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఈ ఉదయం కన్నుమూశారు. వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసి ‘కోట’గా చిరపరిచితులైన ఆయన ఈ తెల్లవారుజామున ఫిలింనగర్‌లోని ఆయన నివాసంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కోట శ్రీనివాసరావు 1942 జులై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. 1968లో రుక్మిణిని వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కొడుకు కోట ప్రసాద్ 21 జూన్ 2010లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నాలుగు దశాబ్దాలపాటు తెలుగు తెరను ఏలిన ఆయన 750కి పైగా సినిమాల్లో నటించారు.
కోట శ్రీనివాసరావు సినిమాల్లోకి రాకముందు భారతీయ స్టేట్ బ్యాంకులో పనిచేశారు. తన నటనతో విలనిజానికి కొత్త భాష్యం చెప్పిన ఆయన రంగస్థల నటుడిగా ఎన్నో ఏళ్లపాటు అలరించారు. ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. కెరియర్ తొలినాళ్లలో సహాయ నటుడిగా, విలన్‌గా నటించారు. టాలీవుడ్ అగ్రహీరోలు సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్, మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ వంటి పాత, కొత్తతరం నటులతో కలిసి నటించారు. ప్రతిఘటన సినిమాతో ఆయన పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో మార్మోగిపోయింది. అహనా పెళ్లంట సినిమా ఆయనలోని మరో నటుడిని వెలికితీసింది. అందులో ఆయన నటించిన పిసినారి పాత్ర నభూతో నభవిష్యత్. ఇక, ఖైదీ నంబర్ 786, యముడికి మొగుడు, బొబ్బిలి రాజా, యమలీల, శివ, సంతోషం, బొమ్మరిల్లు, అతడు, రేసుగుర్రం, ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు వంటి సినిమాలు ఆయనకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి.