దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన వెండితెర అద్భుతం ‘బాహుబలి’ (ది బిగినింగ్, ది కన్‌క్లూజన్) రెండు భాగాలను కలిపి ఏకతా రూపంలో ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో ప్రీమియర్లు మొదలయ్యాయి. ఈ చిత్రానికి సోషల్ మీడియాలో అభిమానుల నుండి విపరీతమైన స్పందన వస్తోంది. ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం భారత సినీ చరిత్రను మార్చిన క్లాసిక్‌గా నిలిచింది.
‘బాహుబలి: ది ఎపిక్’ చూసిన నెటిజన్లు థియేటర్ అనుభూతిని మాటల్లో చెప్పలేమని ప్రశంసిస్తున్నారు. “రీ రిలీజ్ అయినా, ఆ థియేటర్ అనుభూతి మాత్రం మిస్ అవ్వకూడదు. గూస్బంప్స్ కరెక్ట్‌గా ఇవ్వగలిగిన చిత్రం ఇది” అని ఒక అభిమాని ట్వీట్ చేయగా, మరొకరు “10 ఏళ్లు అయినా అదే మాయ, అదే ఎమోషన్. ఇది నిజంగా జక్కన్న బెస్ట్ ఫిల్మ్” అని కామెంట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు విజువల్స్ మరియు సౌండ్ క్వాలిటీ ఐమ్యాక్స్‌లో టాప్ క్లాస్‌గా ఉన్నాయని ప్రశంసించారు, రాజమౌళి గొప్పతనాన్ని మరోసారి చాటిచెప్పారు.
‘బాహుబలి: ది ఎపిక్’ మొదటి భాగం (ది బిగినింగ్) ముగిసిన వెంటనే అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపించారు. “ఇంత స్కేల్, ఇంత ఎమోషన్, ఇంత సినిమాటిక్ ఫోర్స్ ఇప్పటికీ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తోంది” అని ఒక అభిమాని రాశారు. మొత్తంమీద, ఈ రీ-రిలీజ్ సాధారణమైనది కాదని, ప్రపంచానికి భారత సినీ గౌరవాన్ని మరోసారి చూపించిన ఘనత రాజమౌళి గారిదేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

