పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉదార స్వభావం, ఆయన ఆతిథ్యం గురించి సినీ పరిశ్రమలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సహనటులు, నటీమణులకు ఇంటి నుంచి రుచికరమైన వెజ్, నాన్‌వెజ్ వంటకాలతో కూడిన భోజనం పంపించడం ఆయనకు అలవాటు. తాజాగా, ప్రభాస్ పంపిన ఇంటి భోజనాన్ని రుచి చూసిన ‘ఫౌజీ’ సినిమా హీరోయిన్ ఇమాన్వీ ఆశ్చర్యపోవడమే కాకుండా, మనసు, కడుపు రెండూ నిండిపోయాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ప్రభాస్, ఇమాన్వీ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే వార్ రొమాంటిక్ డ్రామా చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. షూటింగ్ విరామ సమయంలో ప్రభాస్ తన ఇంటి నుంచి ఇమాన్వీ కోసం ప్రత్యేకంగా భోజనం పంపించారు. ఆ ఫుడ్ స్ప్రెడ్ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్న ఇమాన్వీ… “నా కడుపు, మనసు రెండూ నిండిపోయాయి. థ్యాంక్యూ ప్రభాస్ గారు” అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గతంలో దీపికా పదుకొణె, శ్రుతి హాసన్, అనుష్క వంటి ఎందరో హీరోయిన్లు ప్రభాస్ ఆతిథ్యాన్ని పొంది ప్రశంసించగా, ఇప్పుడు వారి జాబితాలో ఇమాన్వీ కూడా చేరారు. ‘ఫౌజీ’ చిత్రం స్వాతంత్ర్యానికి పూర్వం నాటి కథతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సీనియర్ నటులు మిథున్ చక్రవర్తి, జయప్రద వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

