ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల కేసులో సిట్ (SIT) అధికారుల ఎదుట విచారణకు హాజరైన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్‌లో పెట్టుబడులు పెట్టి ఎంతో మంది యువత ఆర్థికంగా నష్టపోతున్నారని, దీని వల్ల వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాను చేసిన పొరపాటుకు ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
తాను 2016లో ఒక యాప్‌ను ప్రమోట్ చేశానని, అయితే ఆ యాప్ 2017లో బెట్టింగ్ యాప్‌గా రూపాంతరం చెందిందని ప్రకాశ్ రాజ్ వివరించారు. ఈ విషయం తెలిసిన వెంటనే తాను ఆ సంస్థతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. “తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే” అని పేర్కొంటూ, తాను చేసిన ఈ పొరపాటుకు ప్రజలందరినీ క్షమించమని కోరుతున్నానని ఆయన తెలిపారు.
సిట్ అధికారులకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, డాక్యుమెంట్లు మరియు బ్యాంకు లావాదేవీలను అందజేసినట్లు ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ల కారణంగా నష్టపోయిన వారి కుటుంబాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కష్టపడితేనే ఫలితం, డబ్బు వస్తాయని ప్రజలకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.

