తెలుగు తెరపై మరో బయోపిక్‌కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన ‘మహానటి’ వంటి బయోపిక్‌లు విజయం సాధించిన నేపథ్యంలో, ఇప్పుడు అలనాటి లెజెండరీ కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. తమిళనాడులోని మధురైలో జన్మించిన సుబ్బులక్ష్మి, భారతదేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ పొందిన మొట్టమొదటి సంగీత విద్వాంసురాలు మరియు ‘రామన్ మెగసెసే అవార్డు’ పొందిన తొలి కళాకారిణి కూడా కావడం విశేషం. ఆమెను ‘భారతదేశపు నైటింగేల్’గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
ఈ క్రేజీ బయోపిక్‌లో ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్రలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నటించబోతున్నట్లు సోమవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. సుబ్బులక్ష్మి జీవిత కథతో పాటు ఆమె సాధించిన అవార్డులు, ముఖ్య సంఘటనలను ఈ బయోపిక్‌లో చూపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ మూవీ ‘రామాయణ’లో సీతాదేవిగా నటిస్తున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ ‘గీతా ఆర్ట్స్’ ఈ బయోపిక్‌ను నిర్మించవచ్చని ప్రచారం సాగుతుండగా, ‘మళ్లీ రావా’, ‘జెర్సీ’ వంటి విజయవంతమైన చిత్రాలను తీసిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ ప్రాజెక్టును డైరెక్ట్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది, దీనిపై అభిమానులు మరియు సినీ పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

