హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్, ఎస్.ఎస్. రాజమౌళి తదుపరి చిత్రం ‘వారణాసి’ (SSMB29) సెట్స్‌ను సందర్శించాలని తన కోరికను వెలిబుచ్చారు. డిసెంబర్ 19న విడుదల కానున్న ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన వర్చువల్ ఇంటర్వ్యూలో ఈ ఇద్దరు దిగ్గజ దర్శకులు ముచ్చటించారు. ఈ సందర్భంగా వారిద్దరూ సినిమా మేకింగ్, కొత్త ప్రపంచాల సృష్టి మరియు ఒకరి పనిపై ఒకరికి ఉన్న గౌరవం గురించి చర్చించుకున్నారు.
కామెరూన్ చేతిలో కెమెరా?
మహేష్ బాబు హీరోగా వస్తున్న రాజమౌళి కొత్త ప్రాజెక్ట్ పురోగతి గురించి కామెరూన్ ఆరా తీశారు. ఇంకా ఏడెనిమిది నెలల షూటింగ్ మిగిలి ఉందని రాజమౌళి చెప్పగా, కామెరూన్ ఎంతో ఉత్సాహంగా “నేను మీ సెట్స్‌కు వచ్చి షూటింగ్ చూడవచ్చా?” అని అడిగారు. అంతటితో ఆగకుండా, “మీరు పులులతో ఏవైనా సీన్లు తీస్తుంటే చెప్పండి, నేనే స్వయంగా కెమెరా పట్టుకుని కొన్ని షాట్స్ తీస్తాను” అని సరదాగా ఆఫర్ ఇచ్చారు. దీనికి రాజమౌళి స్పందిస్తూ.. మీరు రావడం మా టీమ్‌కే కాదు, మొత్తం భారత సినీ పరిశ్రమకు గర్వకారణం అని ఎంతో వినయంగా బదులిచ్చారు.
‘ఫైర్ అండ్ యాష్’ ప్రపంచం విశేషాలు
ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి ‘అవతార్ 3’ గురించి పలు ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. రెండో భాగంలో సముద్ర ప్రపంచాన్ని చూపించిన కామెరూన్, ఈ మూడో భాగంలో “యాష్ పీపుల్” (బూడిద తెగ) మరియు నిప్పు నేపథ్యంతో సాగే కొత్త లోకాన్ని పరిచయం చేయబోతున్నట్లు వివరించారు. పండోరా గ్రహంపై ఉండే ఈ కొత్త తెగల జీవనశైలి, విజువల్ గ్రాండియర్ ప్రేక్షకులను మరో సరికొత్త అనుభూతికి లోనుచేస్తాయని కామెరూన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

