CINEMA

వరుసగా నాలుగో హిట్: ‘అనగనగా ఒక రాజు’ సక్సెస్ మీట్‌లో నవీన్ పోలిశెట్టి భావోద్వేగం!

ప్రేక్షకులే నా వెనుక ఉన్న శక్తి: సంక్రాంతి పోటీలో పెద్ద సినిమాల మధ్య తన సినిమాను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు నవీన్ పోలిశెట్టి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. “బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా, లోపల చిన్న ఆందోళన ఉండేది.. కానీ ప్రేక్షకులు దీన్ని బ్లాక్ బస్టర్ చేసి నా భయాన్ని పోగొట్టారు” అని ఆయన అన్నారు. కృష్ణానగర్‌లో అవకాశాల కోసం తిరిగిన రోజులను గుర్తుచేసుకుంటూ, వరుసగా నాలుగు హిట్లు అందించిన ప్రతి తెలుగు కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు.

నిర్మాత నవ్వులో సంతోషం: గత ఏడాది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఆశించిన ఫలితాలు రాని సమయంలో, ఈ సినిమాతో మళ్లీ విజయం రావడం నిర్మాత నాగవంశీకి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని నవీన్ చెప్పారు. నాగవంశీ ముఖంలో చిరునవ్వు చూడటం తనకు చాలా హ్యాపీగా ఉందని, ఈ సినిమా జడ్జిమెంట్‌ను నమ్మిన త్రివిక్రమ్ గారికి, చినబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. థియేటర్లలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషనల్ సీన్లకు వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉందన్నారు.

చిన్మయి ఇచ్చిన మోటివేషన్: ఈ సినిమా రచనలో సహకరించిన కో-రైటర్ చిన్మయి గురించి నవీన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. “నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత క్రియేటివ్ గా కాస్త డౌన్ లో ఉన్నాను.. నేను మళ్లీ రాయగలనా? లేదా? అనుకున్న సమయంలో చిన్మయి నాకు చాలా మోటివేషన్ ఇచ్చింది” అని ఆమెకు థ్యాంక్స్ చెప్పారు. మీనాక్షి చౌదరి, రావు రమేష్ వంటి నటీనటుల పెర్ఫార్మెన్స్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందని నవీన్ కొనియాడారు.