ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ది రాజాసాబ్’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. హారర్ ఫాంటసీ కామెడీగా వచ్చిన ఈ చిత్రం రెబల్ స్టార్ అభిమానులను పూర్తిగా సంతృప్తి పరచలేకపోవడంతో, దర్శకుడు మారుతి సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభాస్ మారుతికి మరో అవకాశం ఇచ్చారని, వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందనే వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి.
ఈ పుకార్లపై ప్రభాస్ టీమ్ తాజాగా స్పందిస్తూ స్పష్టతనిచ్చింది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ మరో సినిమా చేస్తున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ కేవలం ఒట్టి పుకార్లే అని తేల్చి చెప్పింది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌లో మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారని జరిగిన ప్రచారానికి ఈ క్లారిటీతో తెరపడింది. ‘రాజాసాబ్’ ఫలితంతో నిరాశలో ఉన్న అభిమానులకు ఈ వివరణ కొంత ఉపశమనాన్ని ఇచ్చింది.
అయితే, మారుతిపై ఉన్న ట్రోలింగ్ పక్కన పెడితే, ప్రభాస్ ఆయనకు తనవంతు మద్దతు ఇస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ‘రాజాసాబ్’ కోసం మారుతి పడిన కష్టాన్ని గుర్తించిన ప్రభాస్, ఆయనకు మరో ప్రాజెక్ట్ సెట్ చేయడంలో సహాయపడ్డారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే హోంబలే ఫిలిమ్స్ సంస్థ మారుతికి అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం. కాకపోతే ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించడం లేదని, మారుతి సిద్ధం చేసే కథను బట్టి వేరే హీరోతో ఈ చిత్రం ఉంటుందని వినికిడి. ప్రస్తుతం మారుతి కొత్త కథను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.

