CINEMA

నాని ‘ది ప్యారడైజ్’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు!

నేచురల్ స్టార్ నాని, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ విడుదల తేదీ మారింది. తొలుత మార్చి 26న విడుదల కావాల్సిన ఈ సినిమాను, ఇప్పుడు ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో నాని ‘జడల్’ అనే అత్యంత శక్తివంతమైన మాస్ పాత్రలో నటిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద పండగల సీజన్‌ను క్యాష్ చేసుకోవాలనే పక్కా వ్యూహంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా విడుదల తేదీ మార్పు వెనుక బలమైన కారణం ఉంది. ఆగస్టు 21న విడుదల చేయడం ద్వారా ఓనం, మిలాద్-ఉన్-నబీ, రక్షాబంధన్, మరియు శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి వరుస సెలవులను ఈ చిత్రం సద్వినియోగం చేసుకోనుంది. సుమారు మూడు వారాల పాటు బాక్సాఫీస్ వద్ద పండగల సందడి ఉండటంతో, వసూళ్ల వర్షం కురుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ సెట్ వేసి, అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన హై-వోల్టేజ్ మాస్ ఇంట్రడక్షన్ సాంగ్‌ను వందలాది మంది డాన్సర్లతో చిత్రీకరిస్తున్నారు.

శ్రీకాంత్ ఓదెల-నాని కాంబోలో ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ‘బిర్యానీ’ అనే వెరైటీ పాత్రలో కనిపిస్తుండగా, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, ఇంగ్లీష్, స్పానిష్‌తో సహా మొత్తం 8 భాషల్లో పాన్-వరల్డ్ స్థాయిలో విడుదల కానుంది.