గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ కవల పిల్లల పేర్లను వెల్లడిస్తూ మెగా అభిమానులకు తీపి కబురు అందించారు. ఈ నెల 11న అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో చిన్నారుల బారసాల కార్యక్రమం వైభవంగా జరిగింది. అబ్బాయికి ‘శివరామ్ కొణిదెల’ అని, అమ్మాయికి ‘అన్వీరా దేవి కొణిదెల’ అని నామకరణం చేశారు. ఈ పేర్ల వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థాలను, కుటుంబ అనుబంధాన్ని చరణ్ ఒక ఇంటర్వ్యూలో వివరించారు.
పేర్ల ఎంపికపై చరణ్ స్పందిస్తూ.. తమ పిల్లల పేర్లు వినగానే ఆధ్యాత్మిక భావన కలగాలని కోరుకున్నట్లు తెలిపారు. అబ్బాయి పేరు ‘శివరామ్’ లో అటు శివుడు, ఇటు రాముడి పేర్లు కలవడమే కాకుండా, తన తండ్రి చిరంజీవి అసలు పేరు (శివ శంకర వరప్రసాద్) కూడా ప్రతిబింబించేలా జాగ్రత్త పడ్డామని చెప్పారు. ఇక అమ్మాయి పేరు ‘అన్వీరా దేవి’ లో ‘అన్’ అంటే అపరిమితమైన, ‘వీర’ అంటే ధైర్యం, ‘దేవి’ అంటే దైవిక శక్తి అని అర్థం వచ్చేలా ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
మెగాస్టార్ చిరంజీవి తన మనవడు, మనవరాలితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మురిసిపోయారు. చిరంజీవి, సురేఖ దంపతులు వారసులను ఎత్తుకుని ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే క్లీంకారతో సందడిగా ఉన్న మెగా ఇగిలింట్లో, ఇప్పుడు కవలల రాకతో ఆనందం రెట్టింపైంది. తన జీవితంలో మహిళలే అత్యంత బలమని, ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడికి తండ్రిని కావడం తన అదృష్టమని చరణ్ ఈ సందర్భంగా భావోద్వేగంతో పోస్ట్ చేశారు.

