CINEMA

రేఖ వేదవ్యాస్ భావోద్వేగం: అనారోగ్యం వల్లే దూరమయ్యా.. పెళ్లికి ఎవరూ రావడం లేదు

‘ఆనందం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటి రేఖ వేదవ్యాస్ తాజాగా తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వరుసగా తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేసిన ఆమె, గత పదేళ్లుగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం తనను వేధించిన తీవ్రమైన అనారోగ్య సమస్యలేనని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. శారీరక మార్పుల వల్ల తాను గుర్తుపట్టలేనంతగా మారిపోయానని, ఆ సమయంలో మానసికంగా ఎంతో కుంగిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

పెళ్లి విషయంలో కూడా రేఖ చాలా నిర్మొహమాటంగా మాట్లాడారు. కెరీర్ ప్రారంభంలో వివాహంపై పెద్దగా ఆసక్తి లేకపోయినా, కాలక్రమేణా ఒక తోడు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అయితే తన ఆరోగ్య పరిస్థితిని చూసి పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదని, చాలా సంబంధాలు వెనక్కి వెళ్లిపోయాయని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఆరోగ్య సమస్యలు మనిషిని ఇంతలా ఒంటరిని చేస్తాయని తాను ఎప్పుడూ ఊహించలేదని, ఒంటరితనం తనను ఎంతగానో బాధించిందని చెప్పుకొచ్చారు.

ప్రస్తుత సినిమా రంగం పూర్తిగా మారిపోయిందని, తాను ఎన్నో కష్టాలను అనుభవించి మళ్ళీ సాధారణ స్థితికి చేరుకోగలిగానని రేఖ తెలిపారు. “తొందరపడి పెళ్లి చేసుకుని విడాకుల వరకు వెళ్లే బంధాల కంటే, ఆలస్యమైనా మనల్ని అర్థం చేసుకునే మంచి సంబంధం రావాలని ఆశిస్తున్నాను” అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడుతోందని, మళ్ళీ వెండితెరపై కనిపించేందుకు ప్రయత్నిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.