CINEMA

ఒకటైన ‘విరోష్’: నా భర్త విజయ్ దేవరకొండ అంటూ రష్మిక భావోద్వేగ పోస్ట్!

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ బంధంపై గత కొన్నేళ్లుగా సాగుతున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఈ జంట పెళ్లి పీటలెక్కినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విజయ్‌ను ‘నా భర్త’ అని పరిచయం చేస్తూ అత్యంత భావోద్వేగపూరితమైన పోస్ట్‌ను షేర్ చేశారు. “హాయ్ మై లవ్స్.. ఇప్పుడు మీకు నా భర్తను పరిచయం చేస్తున్నాను.. మిస్టర్ విజయ్ దేవరకొండ!” అంటూ ఆమె తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.

విజయ్‌పై తనకున్న ప్రేమను అక్షర రూపంలో ఆవిష్కరిస్తూ.. నిజమైన ప్రేమ అంటే ఏంటో, మనతో మనం ప్రశాంతంగా ఉండటం ఎలాగో నేర్పించిన వ్యక్తి విజయ్ అని రష్మిక పేర్కొన్నారు. “నేను ఏ కలలైతే కన్నానో, వాటిని సాధించగలనని ప్రతిరోజూ నన్ను ప్రోత్సహించిన వ్యక్తి ఇతడే. ఒక మహిళగా నేను ఎలా ఎదగాలని అనుకున్నానో, అలా మారడానికి విజయ్ కారణం. అతడి గురించి చెప్పాలంటే ఒక పుస్తకమే రాయొచ్చు” అని ఆమె కొనియాడారు. స్నేహితులతో ప్రయాణాలు చేయడం, స్వేచ్ఛగా జీవించడం వంటి అద్భుతమైన విషయాలను విజయ్ తనకు పరిచయం చేశారని తెలిపారు.

తమ వివాహ వేడుకకు సంబంధించిన అందమైన ఫోటోలను పంచుకుంటూ, విజయ్ భార్యగా పిలిపించుకోవడానికి తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని రష్మిక వెల్లడించారు. “ఇకపై నా జీవితంలోని ప్రతి గెలుపు, ఓటమి, సంతోషం, బాధ.. అన్నింటికీ సాక్షిగా నువ్వు నా పక్కన ఉన్నావు. మనం కలిసి అత్యద్భుతమైన జీవితాన్ని గడుపుదాం.. ఐ లవ్ యూ” అంటూ తన పోస్ట్‌ను ముగించారు. ఈ ఫెయిరీ టేల్ వెడ్డింగ్ ఫోటోలు చూసి సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ కొత్త జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.