CINEMA

దళపతి విజయ్‌కు భార్య సంగీత షాక్: కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు.. 26 ఏళ్ల బంధానికి ముగింపు?

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా, ‘తమిళ వెట్రి కళగం’ (TVK) పార్టీ అధినేతగా వెలుగొందుతున్న విజయ్ వ్యక్తిగత జీవితంలో పెను భూకంపం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా వీరిద్దరూ విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ, విజయ్ భార్య సంగీత చెంగల్‌పట్టు జిల్లా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. 1999లో వివాహం చేసుకున్న ఈ జంట, సుమారు 26 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక బంధం తర్వాత చట్టబద్ధంగా విడిపోవాలని నిర్ణయించుకోవడం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

సంగీత కోర్టులో సమర్పించిన పిటిషన్‌లో పలు సంచలన ఆరోపణలు చేశారు. విజయ్ ఒక నటితో సంబంధంలో ఉన్నారని, ఆ విషయం తనకు 2021లోనే తెలిసిందని ఆమె పేర్కొన్నారు. సదరు నటితో విజయ్ విదేశాలకు వెళ్లడం, అందుకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడం వల్ల తాను, తన పిల్లలు తీవ్ర అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ తన తప్పును సరిదిద్దుకోకుండా ఆ నటితోనే టచ్‌లో ఉండటం వల్లే తాను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సంగీత వివరించారు.

విజయ్ ప్రస్తుతం 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయాల్లో బిజీగా ఉన్న తరుణంలో ఈ విడాకుల వ్యవహారం ఆయన రాజకీయ ప్రస్థానంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ మొదలైంది. గత ఏడాది కాలంగా విజయ్ పాల్గొన్న ఫంక్షన్లలో సంగీత కనిపించకపోవడంతోనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ వివాదంపై విజయ్ కార్యాలయం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.