మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు కూడా ఒకటి. ఇవి శరీరంలోని మలినాలను, వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయి.
మూత్రపిండాల ఆరోగ్యం బాగుంటేనే మన శరీర ఆరోగ్యం బాగుటుంది. కానీ నేటి తరుణంలో మనలో చాలా మంది మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందనే చెప్పవచ్చు. అయితే చాలా మందికి వారు మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నామన్న సంగతే తెలియదు.
శరీరంలో లక్షణాలు కనిపించినప్పటికీ అవి ఇతర అనారోగ్య సమస్యల వల్ల సంభవించినట్టు భావిస్తారు. ఈ లక్షణాలను గమనించక ఆలస్యం చేసే కొద్దీ మూత్రపిడాల ఆరోగ్యం మరింత క్షీణించి తీవ్ర అనారోగ్యానికి గురి అవుతారు. మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల గురించి అందరూ అవగాహన కలిగి ఉండడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం మరింత క్షీణించకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు మనలో కనిపించే లక్షణాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు శరీరంలో విపరీతమైన అలసట, బలహీనత, రక్తహీనత ఏర్పడుతుంది. ఏ పనిని కూడా ఏకాగ్రతతో, శ్రద్దతో చేసుకోలేరు.
Kidney Disease Symptoms
అదే విధంగా మూత్రపిండాలు సరిగ్గా పని చేయకపోవడం వల్ల శరీరంలో మలినాలు పేరుకుపోతాయి. దీంతో ఊబకాయం, నిద్రలేమి, స్లీప్ ఆప్నియా వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారిలో చర్మం పొడిగా మారడంతోపాటు దురద కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు మూత్రవిసర్జనలో మార్పు వస్తుంది. తరచూ మూసవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. అదే విధంగా మూత్రవిసర్జన సమయంలో మూత్రంలో రక్తం, మూత్రంలో నురుగు, బుడగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
అలాగే మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నప్పుడు కళ్లు ఉబ్బినట్టుగా ఉంటాయి. పాదాలు, కాళ్లు కూడా ఉబ్బినట్టుగా ఉంటాయి. ఇక మూత్రపిండాల వ్యాధులతో బాధపడే వారిలో ఆకలి ఎక్కువగా ఉండదు. కండరాలు తరుచూ తిమ్మిరి పడుతూ ఉంటాయి. మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు మనలో ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయని ఈ లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.