పూబాలలు, బాలలు.. ఎవరినైనా ఆకర్షిస్తారు. ఎంతటి వారైనా తన్మయత్వం చెందుతారు. అందుకే శైశవగీతిలో బాల్యాన్ని పూలతో పోల్చాడు మహాకవి శ్రీశ్రీ.
చిన్నపిల్లలను చూస్తే, వారి ముద్దు ముద్దు మాటలు వింటూ ముద్దు చేయాలనిపిస్తుంది. వారితో సరదాగా సంభాషించాలని అనిపిస్తుంది. ఈ కోవలో ముందు వరుసలో ఉంటారు ప్రధాని నరేంద్రమోడీ. చిన్న పిల్లలో ఆడతారు. వారు పాడుతుంటే భుజం తట్టి బడియా అంటారు. ఆయన తన విదేశీ పర్యటనల్లోనూ చిన్నపిల్లలతో సంభాషిస్తారు. మోడీ చిన్నపిల్లలతో సందడి చేసిన వీడియోలు సోషల్ మీడియాను సర్ఫింగ్ చేస్తూంటే కనిపిస్తుంటూనే ఉంటాయి.
చిన్నపిల్లల ఆట-పాటలను ఇష్టపడే మోడీ.. తను ప్రతీ ఆదివారం ప్రయోక్తగా వ్యవహరించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఒక్కోసారి తన బాల్యాన్ని నెమరేసుకుంటారు. తన చిన్ననాడు చేసిన చిలిపి పనులను చెప్పేందుకూ వెనకాడరు. అంతే కాద పరీక్షలప్పుడు విద్యార్థులు ఎలా ఉండాలో, ఎలా రాయాలో కూడా మోడీ చెబుతుంటారు. విద్యార్థులకు పరీక్షలప్పుడు భయం కలగకుండా ఉండేందుకు ఏకంగా ఒక పుస్తకాన్ని కూడా రూపొందించారు. అప్పట్లో ఈ పుస్తకాలను బీజేపీ నాయకులు విద్యార్థులకు పంచారు.
చిన్నపిల్లాడయిపోయారు
పిల్లలను చూస్తే చిన్నపిల్లాడయి పోయే మోడీ.. ఢిల్లీలో జరిగిన అఖిల భారతీయ శిక్షా సమాగమం కార్యక్రమంలో మరోసారి దీన్ని నిరూపించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి మేథావులు వచ్చారు. కార్యక్రమాన్ని మోడీ ప్రారంభించిన అనంతరం ఆయనను చిన్న పిల్లలు చుట్టుముట్టారు. ‘నమస్తే మోడీ జీ’ అంటూ ఆయనకు నమస్కారం పెట్టారు. ఒక పిల్లాడేమో నేను మిమ్మల్ని టీవీలో చూశాను అని చెప్పగా, అవునా! ఏ కార్యక్రమంలో అంటూ మోడీ ప్రశ్నించారు. మొన్న అమెరికా వెళ్లినప్పుడు అక్కడ మాట్లాడారు కదా! అని ఆ బాలుడు అనగానే ఆశ్చర్యపోవడం మోడీ వంతయింది. ఈసందర్భంగా తాము తయారు చేసిన ఆకృతులను మోడీకి చూపించగా ఆయన సంభ్రమాశ్యర్యాలకు గురయ్యారు. ఈ వీడియోను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, వేలాది మంది వీక్షించారు.