National

మణిపూర్‌లో రాజుకుంటున్న అగ్గిరవ్వలు..

మణిపూర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా కుకీ, మెయిటీ తెగల మధ్య ఘర్షణలతో మండుతున్న మణిపూర్‌లో వెలుగులోకి వస్తున్న దారుణాలు ప్రజలని భయకంపితుల్ని చేస్తున్నాయి.
మే 4న రాష్ట్రంలో ఘర్షణలు ప్రారంభం కాగా, అంతకు కొన్ని రోజుల ముందు అంటే ఏప్రిల్ 30న హంగ్లాల్‌మౌన్ వైఫీ (21) అనే యువకుడిని పోలీసులు చుర్‌చాంద్‌పూర్‌లోని అతడి ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, మెయిటీ కమ్యూనిటీపై ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టినందుకు గాను అతడిని అదుపులోకి తీసుకుని ఇంఫాల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత నాలుగు రోజులకు రాష్ట్రంలో ఘర్షణలు ప్రారంభం కాగా, పోలీసు కస్టడీలో ఉన్న వైఫీని దుండగులు వీధిలోకి లాక్కొచ్చి మరీ కొట్టి చంపేశారు. బీకాం చదువుతున్న వైఫీని మణిపూర్ హైకోర్టు నుంచి సజివాలోని సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా దుండగుల మూక దాడిచేసి, పోలీస్ వ్యాన్ నుంచి అతనిని కిందకు లాగి, కొట్టి చంపేసినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. పోలీసుల నుంచి ఆ మూక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని లాక్కుందని, రాడ్లు, కర్రలతో వైఫీపై దాడిచేసిందని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. వైఫీపై గుంపు భయంకరంగా దాడి చేస్తుండడంతో భయపడిన పోలీసులు అక్కడి నుంచి పారిపోయారు.