సీఎం కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఒక్క నిర్ణయం 43 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చింది. నిత్యం 45 లక్షల మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తున్న టీఎస్ఆర్టీసీ ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థగా మారింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఏటా రూ 3 వేల కోట్ల భారం పడనుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎట్టకేలకు కార్మికుల మనోభీష్టం నెరవేరింది.
విలీనం బిల్లుకు సభ ఆమోదం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఉద్యోగులను ప్రభుత్వ సేవల్లోకి తీసుకోవడం) బిల్లు-2023’ను రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదించాయి. గు రోజులుగా ఉత్కంఠ రేకెత్తించిన సర్కారులో ఆర్టీసీ విలీన ముసాయిదా బిల్లును 10 సిఫారసులు సూచిస్తూ.. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తూ గవర్నర్ సంతకం చేసి ప్రభుత్వానికి పంపించారు.
దీంతో అనేక కష్టనష్టాలతో జీవితాలను వెల్లదీస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత లభించడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా జీతభత్యాలతోపాటు ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ప్రకారం బదిలీలు, ప్రమోషన్లు, పింఛన్, గ్రాట్యుటీ తదితర సౌకర్యాలు కలుగనున్నాయి. ఆదివారం మధ్యాహ్నం ఆర్టీసీ ముసాయిదా బిల్లుకు గవర్నర్ అనుమతివ్వగా, ప్రభుత్వం అంతే వేగంగా బిల్లును రూపొందించి సభ ముందుకు తీసుకొచ్చింది.
ప్రత్యేక చట్టంతో భద్రత
సభలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బిల్లును ప్రవేశపెడుతూ ఆర్టీసి స్థితి గతులను వివరించారు. డీజిల్ ధరలు పెరిగిపోవడంతోపాటు వివిధ కారణాల వల్ల ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లిపోయిందని, దీంతో సంస్థ సేవలు మారుమూల ప్రాంతాల ప్రజలకు, విద్యార్థులు, ఇతర పాస్‌హోల్డర్లకు అవసరమనే ఉద్దేశంతో రాష్ట్ర మంత్రిమండలి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు.
1997 చట్టం ప్రకారం పబ్లిక్ సెక్టార్ యూనిట్‌లో ఉన్న ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకొనేందుకు నిషేధం ఉన్నందున ప్రత్యేక చట్టం తేవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని వివరించారు. ఇందులో భాగంగా రవాణా శాఖలోని అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్‌లో కొత్త డిపార్ట్‌మెంట్ హెడ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు, ఇందులో ఆర్టీసీ ఎక్స్‌అఫీషియో వీసీ అండ్ ఎండీ ఉంటారని చెప్పారు.
43 వేల మందికి ప్రయోజనం
ప్రభుత్వం కొత్త సర్వీసు నిబంధనలు రూపొందించే వరకు ప్రస్తుత ఆర్టీసీ సర్వీసు రూల్స్, ఇతర నిబంధనలే వర్తిస్తాయని చెప్పారు. ఆర్టీసీ రోజువారీ కార్యకలాపాలు, స్థిర, చర ఆస్తుల నిర్వహణ కొత్తగా ఏర్పడే డిపార్ట్‌మెంట్, ఆర్టీసీ డైరెక్టర్ల బోర్డు ఆధ్వర్యంలో కలిసి కొనసాగుతాయని తెలిపారు. వారిని విలీనం చేసుకోవడం వల్ల జీతభత్యాల రూపంలో ప్రభుత్వంపై అదనంగా ఏటా రూ.3,000 కోట్ల భారం పడుతున్నదని వివరించారు.
నేడు ఆర్టీసీలో రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య 43,055 కాగా, కాంట్రాక్టు, క్యాజువల్ ప్రాతిపదికన ఉన్న ఉద్యోగులు 248 మంది ఉన్నారని తెలిపారు. 43,055 మంది ఉద్యోగులు ఈ బిల్లు ద్వారా ప్రభుత్వ సర్వీసులోకి అబ్జార్బ్ అవుతున్నారని, డైలీ వేజెస్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు యథావిధిగా ఏజెన్సీల ఆధ్వర్యంలో కొనసాగుతారని వివరించారు.