National

ప్రయాణికుల కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ట్రావెల్ అడ్వైజరీ- విజ్ఞప్తి

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి పెరిగింది. రద్దీ అసాధారణ స్థాయిలో ఉంటోంది. కొద్దిరోజులుగా ఇవే పరిస్థితులు నెలకొంటోన్నాయి.

విమానం ఎక్కే తమ ఆప్తులకు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సంఖ్య భారీగా ఉంటోంది. ఫలితంగా- వాహనాల రాకపోకలు తరచూ స్తంభిస్తోన్నాయి.

ప్రత్యేకించి- ఈ మధ్యకాలంలో విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థుల రద్దీ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పెద్ద సంఖ్యలో ఉంటోంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ, న్యూజిలాండ్, ఇటలీల్లో సాధారణంగా ఆగస్టు/సెప్టెంబర్ నెలల్లో విద్యా సంవత్సరం ఆరంభమౌతుంటుంది. ఉన్నత చదువుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఆయా దేశాలకు తరలి వెళ్తుంటారు విద్యార్థులు.

మాస్టర్స్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబీఏ.. వంటి ఉన్నత చదువుల కోసం వారు ఆయా దేశాలకు వెళ్తుంటారు. ఏపీతో పోల్చుకుంటే శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయా దేశాలకు నేరుగా ఫ్లైట్ కనెక్టివిటీ ఉంటోంది. ఫలితంగా తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా ఇక్కడికే వస్తుంటారు.

దీని ప్రభావం విమానాశ్రయంపై తీవ్రంగా పడుతోంది. ప్రతి విద్యా సంవత్సరం ఆరంభంలోనూ ఇది సాధారణంగా నమోదయ్యే ప్రక్రియే అయినప్పటికీ- ఈ దఫా మాత్రం రద్దీ మూడింతలయింది. వారికి సెండాఫ్ ఇవ్వడానికి వచ్చే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రద్దీ అధికంగా ఉంటోంది. ఒక్కో ఫ్లైట్‌ కోసం కనీసం 50 నుంచి 60 మంది కుటుంబీకులు, బంధుమిత్రులు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటోన్నారు.

ఫలితంగా ఎయిర్ పోర్ట్‌కు దారి తీసే మార్గాలన్నీ కార్లు, ఇతర వ్యక్తిగత వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. అటు విమానాశ్రయం ఆవరణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇది కాస్తా- విదేశాలకు వెళ్లే ఇతర ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. సకాలంలో విమానాన్ని అందుకోలేమనే ఆందోళన వారిలో నెలకొంటోంది.

దీనితో ఎయిర్ పోర్ట్ అధికారులు తాజాగా ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. తమవారికి సెండాఫ్ ఇవ్వడానికి వచ్చే వారు స్వీయ నియంత్రణ పాటించాలని, విమానాశ్రయం వరకూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. తోటి ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని, తమకు సహకరించాల్సిందిగా కోరారు.