National

నేడు మధ్యాహ్నం భారత రాష్ట్ర సమితి తొలి జాబితా.. ఎవరు ఉంటారు? ఎవరు పోతారు? ఉత్కంఠ

నేడే విడుదల చేస్తారు. కొద్ది గంటల్లో ప్రకటన చేస్తారు. ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో వివరాలు మొత్తం వెల్లడిస్తారు. ఇలా భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల తొలి జాబితాకు సంబంధించి సోమవారం ఉదయం నుంచి ప్రగతి భవన్ లో జరిగిన హడావిడి అంతా ఇంతా కాదు.

సరిగ్గా 12 గంటల మూడు నిమిషాల నుంచి 12 గంటల 50 నిమిషాల వరకు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని భారత రాష్ట్ర సమితి వర్గాలు జోరుగా ప్రచారం చేశాయి. దీంతో సాధారణంగానే ఆశావాహులు ఒకింత ఉత్కంఠగా ఎదురు చూశారు. ఊపిరి బిగ పట్టుకుని కేసీఆర్ ఎవరి పేరు ప్రకటిస్తారోనని ఆశగా ఎదురు చూశారు. కానీ మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని కొంతమంది అంటుంటే..2: 30 నిమిషాల తర్వాత కెసిఆర్ అభ్యర్థుల పేర్లు వెల్లడిస్తారని మరి కొంతమంది అంటున్నారు.

శ్రావణమాసం శుభ ముహూర్తం

అధికమాసం తొలిగిపోయి నిజ శ్రావణమాసం ప్రవేశించిన నేపథ్యం.. పంచమి తిథి.. పైగా శుభ ముహూర్తం కూడా ఉండడంతో కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థుల ప్రకటన చేయాలని సర్వం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఈ క్రతువు ఉంటుందని అందరూ అనుకున్నారు.. కానీ చివరి నిమిషంలో వాయిదా పడడం ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. పక్కాగా సోమవారం జాబితా విడుదల ఉంటుందని.. సమయం మాత్రమే కాస్త అటు ఇటుగా మారుతుందని భారత రాష్ట్ర సమితి నాయకులంటున్నారు. మొదటి జాబితాలో 80 నుంచి 87 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని తెలుస్తోంది. ఈ జాబితాలో 20 నుంచి 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్టు ఇవ్వడం లేదని తెలిసిపోయింది. అయితే ఇవాళ విడుదల చేసే జాబితాలో మాత్రం పదిమంది సిటింగ్ ఎమ్మెల్యేల పేర్లు ఉండవని తెలుస్తోంది. రెండవ జాబితా ఈనెల 25న ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసే అవకాశం ఉంది. పరిస్థితి ఇలా ఉంటే ముందుగానే టిక్కెట్లు రావని అధిష్టానం సంకేతాలు ఇవ్వడంతో భారత రాష్ట్ర సమితిలో అసంతృప్తులు తారాస్థాయికి చేరాయి. వీరిలో చాలామంది మంత్రి హరీష్ రావుకు వార్నింగ్ ఇస్తున్నారు. సిద్దిపేటలో ఆయనను ఓడిస్తామని శపథాలు కూడా చేస్తున్నారు. మరి కొందరైతే ముఖ్యమంత్రి కి అన్నీ తెలుసని, కచ్చితంగా టికెట్ ఇస్తారని చెబుతున్నారు.

ప్రగతి భవన్ చుట్టూ చక్కర్లు

ఆశావాహులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతున్నారు. ప్రకటన ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక మంత్రి కేటీఆర్ హైదరాబాదులో లేకపోవడంతో ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీష్ రావు చుట్టూ ఆశావాహులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు.. ఒక్కసారి కి టికెట్ ఎలాగైనా ఇప్పించండి అంటూ వేడుకుంటున్నారు. రేఖా నాయక్, ఎన్. సంజయ్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎల్. రమణ, సునీతా లక్ష్మారెడ్డి, బొంతు రామ్మోహన్, బానోత్ చంద్రావతి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి వారు కవితను, హరీష్ రావును కలిసిన వారిలో ఉన్నారు. మరోవైపు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మధుసూదనా చారి ఇద్దరూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతిభవన్లో కలిశారు. అయితే వీరిద్దరికీ అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది.