రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు చేసిన ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని రష్యా ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబావుటా ఎగురవేసి వెనక్కి తగ్గాడు. రష్యాలోని తెవర్ రీజియన్‌లో ప్రయాణికులతో కూడిన విమానం కూలిపోయినట్లు తొలుత సమాచారం అందింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. చనిపోయిన ప్రయాణికుల్లో ప్రిగోజిన్ కూడా ఉన్నట్లు రష్యా ఏవియేషన్ ఏజెన్సీ వెల్లడించింది. విమానం మాస్కో నుంచి సెయింట్‌పీటర్స్‌బర్గ్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతిచెందిన వారిలో ఏడుగురు ప్రయాణికులు కాగా, ముగ్గురు విమాన సిబ్బంది ఉన్నారు.
రష్యా సైన్యానికి అండగా..
ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో భాగంగా కొన్నాళ్లు రష్యా సైనిక బలగాలకు అండగా ఉన్న ప్రిగోజిన్.. జూన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆయన ప్రభుత్వంపై ఎదురుతిరిగారు. ఉక్రెయిన్‌లో తమ బలగాలకు ఎదురవుతున్న సవాళ్ల విషయంలో రష్యా రక్షణ శాఖపై బహిరంగంగా తన అసంతృప్తి వ్యక్తం చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. పుతిన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా రష్యా ఉలిక్కిపడింది. తాము చేస్తున్నది న్యాయం కోసం పోరాటమేనని, తిరుగుబాటు కాదని ప్రిగోజిన్ అప్పట్లో పేర్కొన్నారు. అయితే బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో మధ్యవర్తిత్వం చేసి వాగ్నర్ బృందాలు మరింత ముందుకెళ్లకుండా ఆపారు. దీంతో వెనక్కి తగ్గిన వాగ్నర్ చీఫ్.. రక్తపాతం లేకుండా చేయడానికి తమ దళాలను వెనక్కు తీసుకునేందుకు అంగీకరించడంతో తిరుగుబాటు యత్నానికి బ్రేక్ పడింది.
పుతిన్ ఆంతరంగికుల్లో ఒకడు..
రష్యా అధ్యక్షుడు పుతిన్ పొలిటికల్ సర్కిల్‌లో ప్రిగోజిన్ అంటే తెలియని వారుండరు. అతన్ని ‘పుతిన్ చెఫ్’గా వ్యవహరిస్తుంటారు. పుతిన్ ఆంతరంగికుల్లో ప్రిగోజిన్ ఒకరు. 1980లో దొంగతనం, దోపిడీ కేసుల్లో ప్రిగోజిన్ దాదాపు 9 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. 1990లో పుతిన్‌తో ఇతనికి పరిచయం ఏర్పడింది. 2000లో పుతిన్ రష్యా అధ్యక్షుడు అయ్యారు. మరోవైపు.. ప్రిగోజిన్ రెస్టారెంట్లు ఇతర వ్యాపారాలను విస్తరించారు. రష్యా ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాల ఫుడ్ కాంట్రాక్టులు ఇతనికే దక్కాయి.
ప్రైవేటు సైన్యం అతడి చేతిలోనే..
ఇవి కాకుండా మరో కీలక విభాగం ఇతని కనుసన్నల్లో ఉంది. అదే పుతిన్ ప్రైవేటు సైన్యం.. వాగ్నర్ ప్రైవేటు మిలటరీ కంపెనీ (పీఎంసీ)..! ఈ గ్రూపులో మొత్తం కిరాయి సైనికులే వుంటారు. వీరు రష్యాకు, పుతిన్‌కు విదేశాల్లో అవసరమైన లక్ష్యాలను సాధించడానికి రహస్యంగా పనిచేస్తారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్య క్రమంలో అక్కడి కీలక ‘బఖ్‌ముత్’ నగరాన్ని కైవసం చేసుకోవడంలో వీరిదే కీలక పాత్ర. ఈ గ్రూప్‌నకే ప్రిగోజిన్ అధిపతిగా వ్యవహరించారు.
తిరుగుబాటుతో పుతిన్ ఆగ్రహం..
ఆంతరంగికుల్లో ఒకడైన ప్రిగోజిన్ యుద్ధ సమయంలో తిరుగుబాటు చేయడమే పుతిన్‌కు కోపం తెప్పించింది. అయితే బెలారస్ అధ్యక్షుడి సహాయంతో తిరుగుబాటుకు తాత్కాలికంగా చెక్ పెట్టిన పుతిన్.. తర్వాత ప్రిగోజిన్‌కు రహస్యంగా కలిశారు కూడా. కానీ పుతిన్ కోపం చల్లారలేదు. తిరుగుబాటు దారుడిని వదిలేస్తే.. భవిష్యత్‌లో ప్రమాదమని భావించిన రష్యా అధ్యక్షుడు తన చేతికి మట్టి అంటకుండా లేపేసినట్లు తెలుస్తోంది.