వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులను పోలీసులు కొట్టారంటూ వస్తున్న ఆరోపణలపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వీ రంగనాథ్ నేడు స్పందించారు. ప్రశాంత్ అనే విద్యార్థికి నెల క్రితమే గాయమైందని అన్నారు.
పోలీసుల దాడిలో అతడి కాలు విరగలేదని చెప్పారు. ఎవరికైనా అనుమానం ఎక్కడికైనా వెళ్లి టెస్టులు చేయించుకోవచ్చని సూచించారు.
ఆందోళనకారులను వీసీ చాంబర్ నుండి బయటకు తీసుకువెళ్తున్న క్రమంలో ఒక విద్యార్థికి మాత్రం చిన్న ఫ్రాక్చర్ అయిందని వివరించారు. లేని గాయాలకు కూడా విద్యార్థులు కట్లు కట్టుకున్నారని ఆరోపించారు. కొంతమంది ఏబీవీపీ విద్యార్థులు వీసీ చాంబర్ డోర్ పగలగొట్టి కంప్యూటర్లు ధ్వంసం చేశారని, ఆ విద్యార్థులే ఫిబ్రవరి 28వ తేదీన బైరి నరేష్ పై కూడా దాడి చేశారని, పోలీసులు తమను కొట్టారంటూ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
యూనివర్సిటీలో తప్పులు జరిగితే కోర్టులలో పోరాడవచ్చు కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పని ఆయన పేర్కొన్నారు. కేయూ వీసీ కళ్లలో ఆనందం చూసేందుకు నేను గన్ పెట్టి బెదిరించానని కేయూ విద్యార్థులు ఆరోపిస్తున్నారని పేర్కొన్న వరంగల్ సిపి రంగనాథ్, తానే దగ్గరుండి మరీ కొట్టానని చెబుతున్నారని, తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
పీహెచ్డీ అడ్మిషన్ల విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినట్టు భావించినా చట్టపరంగా కోర్టుల ద్వారా విద్యార్థులు తేల్చుకోవచ్చని, కానీ యూనివర్సిటీలో విధ్వంసం చేయడం సమంజసం కాదన్నారు. కోర్టులో కూడా వైద్య పరీక్షల బోగస్ సర్టిఫికెట్లు పెట్టారన్నారు . తమను పోలీసులు కొట్టారని మెజిస్ట్రేట్ ముందు కూడా చెప్పారని, పాత గాయాలు చూపి జడ్జిని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని సిపి రంగనాథ్ పేర్కొన్నారు.