బెంగళూరు/బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్, కేఆర్ పీ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మరోసారి ప్రజల ముందు తలక్కుమని మెరిశారు.
గంగావతి నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయిన గాలి జనార్దన్ రెడ్డి ఆ నియోజక వర్గం ప్రజలకు ప్రతిరోజు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
గంగావతి నియోజక వర్గంలోని హీరేహళ్ల డామ్ కు బాగిన (మొక్కులు, గంగమ్మ తల్లికి సారె) సమర్పించిన ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఆ ప్రాంత ప్రజల మీద దయ చూపించాలని గంగాదేవిని కోరుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డి బాగిన సమర్పిస్తున్న సందర్భంగా విధానపరిషత్ మాజీ సభ్యుడు కరియన్న సంగటి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంపాపతితో పాటు పలువురు పాల్గొన్నారు.
హిరేహళ్ల డ్యామ్ నిండిపోయి కలకలలాడుతోంది. ఎమ్మెల్యే జనార్దనరెడ్డి గ్రామస్తులు, పార్టీ నాయకులతో కలిసి డ్యామ్ కు ప్రత్యేక పూజలు చేసి బాగిన సమర్పించారు. ఈ డ్యామ్‌లో దాదాపు 1.62 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఆనకట్ట చుట్టుపక్కల ఉన్న పలు గ్రామాలకు తాగునీరు అందించడమే కాకుండా 20 వేల ఎకరాలకు పైగా ఉన్న భూములకు సాగునీటి సౌకర్యం కల్పిస్తోంది.
ఈ ఎన్నికల్లో కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీ అభ్యర్థిగా గంగావతి నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గంగావతి నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలకు జీవనాడి అయిన హీరేహళ్ల డామ్ కు ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి ప్రత్యేక పూజలు చేసి బాగిన సమర్పించారు.
ఈ సందర్బంగా గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు తాగునీరుతో పాటు సాగునీరు అందిస్తున్న హీరేహళ్ల డ్యామ్ ఇక్కడి ప్రజలు పచ్చగా ఉండటానికి ఎంతో దోహదపడుతోందని అన్నారు. తన మీద నమ్మకంతో నకు ఓట్లు వేసి గెలిపించిన గంగావతి నియోజక వర్గ ప్రజలకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఇక్కడి నుంచి తాను పోటీ చేస్తానని కేఆర్ పీపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు.