National

పార్లమెంటులో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది

న్యూఢిల్లీ: పార్లమెంటులో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు(women’s reservation bill)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

నారీ శక్తి అధినియమ్ పేరుతో ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

బుధవారం ఈ బిల్లుపై దాదాపు 8 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం బుధవారం రాత్రి న్యాయశాఖ మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 454 మంది ఎంపీలు అనుకూలంగా.. ఇద్దరు వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో చారిత్రక మహిళా బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లయింది.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాన్యువల్ పద్ధతిలోనే ఓటింగ్ జరిగింది. ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పులను లోక్‌సభలో సభ్యులందరికీ అందజేశారు. అనంతరం ఓటింగ్ జరిగే ప్రక్రియపై లోక్‌సభ సెక్రటరీ జనరల్ సభ్యులకు వివరించారు. బిల్లుకు మద్దతు తెలిపినట్లయితే.. ‘ఎస్’ అని ఆకుపచ్చ స్లిప్పుపై రాయాలని.. వ్యతిరేకిస్తే ఎరుపు స్లిప్పుపై ‘నో’ అని రాయాలని చెప్పారు.

ఆ తర్వాత ఓటింగ్ జరిగింది. రాజ్యాంగ సవరణ కూడా ఉండటంతో మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్ చేపట్టారు. ఓటింగ్‌కు కొద్ది సేపటి ముందే ప్రధాని నరేంద్ర మోడీ సభలోకి వచ్చారు. ఆయన వచ్చని తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఓటింగ్ జరిగింది. దాదాపు సభలోనే అత్యధిక మంది సభ్యుల మద్దతుతో బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో గత రెండు దశాబ్దాలకుపైగా ఎదురుచూపులకు తెరపడినట్లయింది. అయితే, మహిళా రిజర్వేషన్లు మాత్రం వచ్చే సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

కాగా, దేశ అభివృద్ధి ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరగాలని ప్రభుత్వం కోరుకుంటోందని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం అన్నారు. అయితే, చట్టాన్ని అమలు చేయడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు, ఎందుకంటే డిలిమిటేషన్ కసరత్తు పూర్తయిన తర్వాత మాత్రమే రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది. ఇది రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికలకు అమలులోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. దీనిపైనే ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. వెంటనే జనగణన, డీలిమిటేషన్ చేపట్టాలని డిమాండ్ చేశాయి.