ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది. తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు భద్రత విషయంలో టిడిపి నేతలు, నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక రిమాండ్ ఖైదీ డెంగ్యూతో మృతిచెందడంతో, చంద్రబాబు ఆరోగ్యంపై కూడా టిడిపి శ్రేణులలో ఆందోళన వ్యక్తం అవుతుంది.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకి ప్రాణహాని ఉందని, జైల్లోనే చంద్రబాబును చంపేందుకు వైసిపి ప్రభుత్వం , సీఎం జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని నారా లోకేష్ ఆరోపణలు చేశారు. ఇక దీనికి కౌంటర్ ఇచ్చిన వైసీపీ ఎంపీ నందిగం సురేష్ చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం ఉంది ఆయన కుమారుడు నారా లోకేష్, టిడిపి నేతలు నుంచే అంటూ వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుపై సానుభూతి కోసం టిడిపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎవరికీ భయపడేది లేదని చెప్పే చంద్రబాబు దోమలకు భయపడతారా.. అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు లాగానే లోకేష్ కి కూడా వెన్నుపోటు విద్య బాగా అబ్బినట్టు ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎంపీ నందిగం సురేష్ చంద్రబాబు పదవి కోసం లోకేష్ చేసే అవకాశం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుకు జైల్లో దోమల బెడద: రఘురామ చెప్పినట్టు.. డెంగ్యూ వ్యాప్తికి కుట్ర!!
ఇక చంద్రబాబు ప్రాణాలకు హాని ఉందని స్టేట్మెంట్లు ఇస్తున్న వారి ఫోన్లను చెక్ చేయాలని నందిగం సురేష్ పేర్కొన్నారు. చంద్రబాబు పదవి కోసం లోకేష్ ఏమైనా చేయొచ్చని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈరోజు అసెంబ్లీలో బాలకృష్ణ వ్యవహారంపై మండిపడిన నందిగం సురేష్ అసెంబ్లీలో బాలకృష్ణ చేష్టలు దారుణంగా ఉన్నాయని, వీళ్ళు ప్రజా నాయకులా.. అంటూ ప్రశ్నించారు.
బాలకృష్ణ మెంటల్ అని సర్టిఫికెట్ తెచ్చుకున్నాడని, రాజకీయాలలో పిచ్చోళ్ళకు స్థానం లేదని నందిగం సురేష్ వ్యాఖ్యానించారు. అంతేకాదు వారం రోజుల నుంచి ఢిల్లీలో ఉంటున్న లోకేష్ ఏపీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరు సైకో లని ఎంపీ నందిగం సురేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.