National

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ప్రత్యేకించి- తెలంగాణపై దీని తీవ్రత అధికంగా ఉంటోంది.

హైదరాబాద్‌లో అతి భారీ వర్షం దంచికొట్టింది. మరో మూడు రోజుల పాటు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

బంగాళాఖాతం వాయవ్య దిశలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ దక్షిణ ప్రాంతాల మీదుగా విస్తరించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణలో మరో మూడు రోజుల పాటు అంటే 27వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఏపీ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు సైతం ముందు జాగ్రత్త హెచ్చరికలను జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతిపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, కడప, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగులు పడే సమయంలో రైతులు, వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించింది.

అటు తెలంగాణలో ఇదే పరిస్థితి నెలకొంది. వచ్చే 48 గంటల్లో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

నిజామాబాద్‌, పెద్దపల్లి, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో జిల్లాల్లో మంగళవారం వరకు వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది వాతావరణ కేంద్రం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.