జార్ఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను బెంగళూరు-భాగల్పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఖచ్చితమైన సంఖ్యను అధికారులు ప్రకటించాల్సి ఉంది.
అనసోల్ పరిధి జంతారా ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు, రైల్వే పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడినవారిని అంబులెన్స్‌ల్లో హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
‘జామ్తారాలోని కలాఝరియా రైల్వే స్టేషన్‌లో రైలు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. కొన్ని మరణాలు నివేదించబడ్డాయి. ఖచ్చితమైన మరణాల సంఖ్య తరువాత నిర్ధారించబడుతుంది. వైద్య బృందాలు, అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి’ అని జమ్తారా డిప్యూటీ కమిషనర్ తెలిపారు.
జమతారా ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ మీడియాతో మాట్లాడుతూ.. నేను ఘటనా స్థలానికి బయలుదేరుతున్నాను. ప్రమాదానికి బాధ్యులైన వారిని గుర్తించాలని ఆదేశాలు ఇచ్చాను. అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం. మృతులను ఇంకా గుర్తించలేదు అని తెలిపారు.
కాగా, జంతారా జిల్లాలోని కల్జారియా ప్రాంతంలో కొంతమంది ప్రయాణికులు రాంగ్ సైడ్ నుంచి రైలు నుంచి దిగడం వల్ల ప్రమాదం జరిగిందని మొదట జంతారా సబ్ డివిజన్ పోలీసు అధికారి (SDPO) రెహమాన్ తెలిపారు. ‘ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను వెలికితీశారు. రెస్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది’ అని చెప్పారు.