National

కాంగ్రెస్ ఆరో జాబితా విడుదల..

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఐదుగురు అభ్యర్థులతో ఆరో జాబితాను సోమవారం విడుదల చేసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని నాలుగు, తమిళనాడులోని ఒక స్థానానికి అభ్యర్థులను ఖరారు చేసింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పోటీ చేస్తున్న కోటా స్థానంలో బీజేపీ మాజీ నేత ప్రహ్లాద్ గుంజాల్‌ను బరిలోకి దించింది.

 

రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజేకు అత్యంత సన్నిహితుడైన ప్రహ్లాద్ గత వారం రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి రామచంద్ర చౌదరీ, రాజసమంద్ నుంచి సుదర్శన్ రావత్, భిల్వారా నుంచి దామోదర్ గుర్జార్ ను బరిలో దింపింది. తమిళనాడులోని తిరునెల్వేలి స్థానంలో ప్రముఖ అడ్వొకేట్ సి రామర్ట్ బ్రూస్‌ను పోటీలో నిలబెట్టింది.

 

 

తాజా, జాబితాతో కలిపి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 190 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే, 6వ జాబితాలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గాంధీ కుటుంబసభ్యులు పోటీ చేసే అమేథీ, రాయ్‌బరేలీ పార్లమెంట్ నియోజకవర్గాల పేర్లు లేకపోవడంతో వారి పోటీ ఉంటుందా? లేదా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే, అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

 

మరోవైపు, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహించిన రాయ్‌బరేలీ స్థానంలో ఈసారి ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాను రంగంలోకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ రెండు స్థానాల్లో గాంధీ కుటుంబసభ్యులే పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నప్పటికీ.. అధికారిక ప్రకటన మాత్రం రాకపోవడం గమనార్హం. హోళీ తర్వాత ఈ స్థానాలపై నిర్ణయం తీసుకుంటారని యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్‌రాయ్ ఇటీవల ప్రకటించారు. దీంతో పార్టీ తదుపరి జాబితాలో ఈ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.