National

వరుస షాకులు, కేజ్రీవాల్ ఆ పిటీషన్ తిరస్కరించిన ట్రయల్ కోర్టు..!

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడి అధికారులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు వరుస షాకులు తగులుతున్నాయి. నిన్న ఢిల్లీ హైకోర్టు కేజ్రివాల్ అరెస్ట్ అక్రమమని, ఈడి అధికారుల అరెస్ట్ ను రద్దు చేయాలంటూ దాఖలుచేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేసి కేజ్రీవాల్ కు షాకిచ్చింది. తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు కూడా మరొక గట్టిషాక్ ఇచ్చింది.

 

లాయర్లను కలిసే సమయం పెంచాలన్న విజ్ఞప్తిపై కోర్టు స్పందన జైల్లో ఉన్న తనకు న్యాయ సలహాలు తీసుకోవడానికి సమయం పెంచాలని కోర్టును విజ్ఞప్తి చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిపిన ట్రయల్ కోర్ట్ దానిని కొట్టివేసింది. ముఖ్యమంత్రిగా విధులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు, అలాగే తనకు కావాల్సిన న్యాయసలహాలు తీసుకునేందుకు తనకు లాయర్లతో కలిసే సమయం సరిపోవడంలేదని, దానిని పెంచాలని అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటీషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది.

 

కేజ్రీవాల్ అభ్యర్ధన నిరాకరణ ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ తన లాయర్లను వారానికి రెండుసార్లు మాత్రమే కలవడానికి అవకాశం ఇచ్చింది. ఇక ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ తనను అరెస్టు చేయడానికి కేజ్రివాల్ సవాల్ చేసి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టి వేయగా, తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు కూడా కేజ్రీవాల్ కు లాయర్లను కలవడానికి అదనపు సమయాన్ని ఇవ్వలేమని, ఆయన అభ్యర్థనను నిరాకరించింది.

 

కేజ్రీవాల్ బయటకు రాకుండా ఈడీ బిగిస్తున్న ఉచ్చు.. ఇదిలా ఉంటే అరవింద్ కేజ్రీవాల్ బయటకు రాకుండా ఈడి అధికారులు కోర్టులో బలమైన వాదనలు వినిపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ అని, ఆయనను బయటకు వెళ్లనిస్తే కేసులో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, దర్యాప్తుకు ఇబ్బంది కలుగుతుందని గట్టిగా వాదిస్తున్నారు. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఈడీ అధికారులు సేకరించిన అన్ని ఆధారాలను కోర్టు ముందుంచి కేజ్రీవాల్ బయటకు రాకుండా ఈడీ అధికారులు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు.