దిల్లీ నడిబొడ్డున ఉన్న ఎర్రకోట తమదే అని.. తమ పూర్వీకుల ఆస్తిని తమకు అప్పగించాలంటూ దిల్లీ హైకోర్టులో(Delhi High Court) ఓ పిటిషన్ దాఖలైంది. ఈ కోటను మొఘల్ చక్రవర్తులు నిర్మించినట్లు చెబుతుంటడా… వారి వారసులకే ఈ సంపద దక్కాలని, అలా భారత ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ ఓ అభ్యర్థన కోర్టు ముందుకు వచ్చింది. ఎర్రకోట తమ పూర్వీకుల ఆస్తి అని.. ఎర్రకోటను తమకు స్వాధీనం చేయాలంటూ పిటిషన్ వేశారు. దీంతో ఇప్పుడు ఈ కేసు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
ఎర్రరాతి శిలలతో, దిల్లీ నగరంలో అద్భుతంగా నిర్మించిన ఎర్రకోట (Red Fort).. ఇక్కడ ప్రభుత్వానికి, ప్రజలకు చెందిన ఆస్తి కాదు. అది తమ పూర్వీకులు, ఈ దేశాన్ని పరిపాలించిన మొఘల్ చక్రవర్తలది. కాబట్టి.. ఆ ఆస్తిని మొఘల్ వారసులకు అప్పగించాలి అంటూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.. మొఘల్ చక్రవర్తి బహదూర్ జాఫర్ – II (Mughal emperor Bahadur Shah Zafar-II)ముని మనుమడి భార్య సుల్తానా బేగం. తమ పూర్వీకుల నుంచి బ్రిటీషర్లు ఈ కట్టడాన్ని స్వాధీనం చేసుకున్నారని, అక్కడి నుంచి భారత ప్రభుత్వానికి ఈ కట్టడం బదలి అయ్యిందని వాదించిన పిటిషనర్.. ఈ ఆస్తికి తామే అసలైన వారసులమని కోర్టుకు తెలిపింది. కాబట్టి.. ప్రస్తుత కోటను తమకు అప్పగించాలని అభ్యర్థించింది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది.
ఎర్రకోట ప్రస్తుతం భారత ప్రభుత్వ వారసత్వ సంపదల జాబితాలో ఉంది. ఇక్కడి నుంచే ప్రతీ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం నాడు భారత ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జాతినుద్దేశించి ప్రసంగిస్తుంటారు. అలాంటి కోటను తమదిగా ప్రకటించాలని కోరుతున్నారు.. మొఘల్ రాజులకు చెందిన తరాల నాటి వారసులు.
మొదటి స్వాతంత్రోద్యమం తర్వాత ఈ కోటను బ్రిటిష్ (Britishers)కంపెనీ అక్రమంగా ఆక్రమించుకుందని పిటిషనర్ సుల్తానా బేగం పేరుకుంది. బ్రిటిష్ వారి దుశ్చర్యలతో మొగల్ చక్రవర్తులు దేశం విడిచి వెళ్లిపోయారని అలా మొఘల్ చక్రవర్తి బహదూర్ జాఫర్ – II భారత్ విడిచి వెళ్లారని తెలిపారు. అలా.. ఆయన 1862లో మృతి చెందారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కట్టడం చివరిగా.. ఆయన స్వాధీనంలోనే ఉందని.. ఆ తర్వాత ఇతరులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు ఆయన ముని మనవడి భార్యగా తనకు, తన వారసులకే.. ఆ ఆస్తిపై హక్కులున్నాయని పేర్కొన్నారు. కాబట్టి.. ఈ కట్టడాన్ని తమకు తిరిగి ఇచ్చేలా భారత ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ ఎర్రకోటను తమకు అప్పగించడం వీలుకాకపోతే.. అందుకు తగిన పరిహారమైనా ఇప్పించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఎర్రకోట తమదే అంటున్న మొఘల్ వారసుల పిటిషన్ పై విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విభూ బక్రు(Chief Justice Vibhu Bakhru), జస్టిస్ తుషార్ రావుల(Justice Tushar Rao) ధర్మాసనం.. సుల్తానా బేగం పిటిషన్ ను కొట్టివేసింది. పిటిషినర్ చెబుతున్నట్లుగా ఎర్రకోట వారి పూర్వీకులదే అయినా.. దాన్ని తిరిగి పొందేందుకు 150 ఏళ్ల సుదీర్ఘ సమయం తర్వాత అప్పీల్ చేయడం సరైంది కాదని అభిప్రాయపడింది. పిటిషనర్ అప్పీల్ చేయడంలోని ఆలస్యం కారణంగా ఈ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్లు తీర్పులో వెలువరించింది. అయితే.. పిటిషనర్ సుల్తానా.. 2001లోనే దిల్లీ హైకోర్టులో ఎర్రకోట తమదే అంటూ దాఖలు చేశారు.
ఎర్రకోట మొగల్ చక్రవర్తి షాజహాన్.. 15వ శతాబ్దంలో నిర్మించిన అతిపెద్ద కోట. దీని నిర్మాణాన్ని 1639 మే 13న ప్రారంభించి 1648 ఏప్రిల్ 6 ను పూర్తి చేశారు. 1857 లో మొగల్ చక్రవర్తి బహుదూర్ జాఫర్ – II బ్రిటిష్ వారి పాలనలోని భారత ప్రభుత్వంలో బహిష్కరణ గురి కావడంతో దిల్లీని విడిచి పారిపోయారు. అప్పటి వరకు ఈ కోట దిల్లీ రాజధానికి కేంద్రంగా ఉండేది. బ్రిటిష్ హయాంలో ఈ కోట ఒక సైనిక శిబిరంలాగా వినియోగించారు. స్వాతంత్య్రం అనంతరం భారత ప్రభుత్వ ఆధీనంలోకి ఈ కోట వచ్చింది. ప్రస్తుతం.. దీనిని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా గుర్తించి వినియోగిస్తున్నారు. ఈ ఎర్రకోట యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా 2007లో గుర్తించారు.