రైతులకు ఆర్బీఐ శుభవార్త చెప్పింది. వ్యవసాయ అవసరాలకు, పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైతులకు ఎలాంటి తనఖా లేకుండా రూ.1.6 లక్షల వరకూ రుణం తీసుకునే అవకాశం ఉండగా, ఇటీవల దాన్ని రూ.2 లక్షల వరకూ పెంచింది.
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని తాజాగా ఆర్బీఐ స్పష్టం చేసింది. పంట సాగుకు రైతులు పెడుతున్న ఖర్చులను, ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిశీలిస్తూ ఆర్బీఐ ఈ పరిమితి పెంచుతూ వస్తోంది.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం .. సాధారణంగా భూ యజమాని నుంచి ఎలాంటి పూచీకత్తు అడగకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేయాల్సి ఉన్నా క్షేత్ర స్థాయిలో ఇది అమలు కావడం లేదు. బ్యాంకులు ఎవరో కొందరికి మాత్రమే (డిపాజిట్లు ఉన్న రైతులకు) ఇలాంటి రుణాలు మంజూరు చేస్తూ ఆర్బీఐ నిబంధనలు పాటిస్తున్నట్లు బయటకు చెబుతుంటాయి.
దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలను తీసుకొని అప్పులపాలవుతున్నారు. ఇలాంటి వారికి అండగా ఉండేందుకే ఆర్బీఐ ఈ సదుపాయం కల్పిస్తోంది. వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నందున రైతులకు రుణ సదుపాయం మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్యల వల్ల చిన్న, సన్నకారు రైతులైన 86 శాతం మందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది.