ఇంకొన్ని గంటల్లో ఈ ప్రపంచం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. ఎన్నో కొత్త ఆశలతో 2025 రాబోతోంది. కొత్త ఏడాదిని స్వాగతం పలకడానికి భారత్ సహా అన్ని దేశాలు సంసిద్ధం అయ్యాయి. ఒక్కో దేశం ఒక్కో విధంగా కొత్త ఏడాదిలో ఎంట్రీ ఇవ్వబోతోంది.
కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి కొత్త ఏడాది వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు చాలామంది. ఈ క్రమంలో పలు ఆధ్యాత్మిక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తుంటారు. ఈ క్రమంలో దక్షిణాన చిట్టచివరి ప్రాంతం కన్యాకుమారికి వెళ్లే వారికి శుభవార్త వినిపించింది తమిళనాడు ప్రభుత్వం.
కన్యాకుమారి వద్ద కొత్తగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్.. దీన్ని ప్రారంభించారు. పర్యాటకుల కోసం ఈ గ్లాస్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చారు. కొందరు మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రతిష్ఠాత్మక తిరువళ్లువర్ విగ్రహం- వివేకానంద రాక్ మెమోరియల్‌ను కనెక్ట్ చేస్తూ నిర్మితమైన అద్దాల వంతెన ఇది. దీని నిర్మాణ వ్యయం 37 కోట్ల రూపాయలు. బంగాళాఖాతం- హిందూ మహా సముద్రం సంగమించే ప్రదేశంపై ఇది నిర్మితమైంది. దీని పొడవు 77 మీటర్లు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం దీన్ని నిర్మించింది.
133 అడుగుల ఎత్తు ఉన్న తిరువళ్లువర్ విగ్రహాన్ని నెలకొల్పి 25 సంవత్సరాలవుతోంది. 2000 సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి దీన్ని ప్రారంభించారు. 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు తిరువళ్లువర్ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ గ్లాస్ బ్రిడ్జిని నిర్మించింది.
ప్రస్తుతం ఈ రెండింటి మధ్య పర్యాటకులు తిరుగాడటానికి ఫెర్రీలు అందుబాటులో ఉన్నాయి. వాటిని- పూంపుహార్ షిప్పింగ్ కంపెనీ నడిపిస్తోంది. ఇప్పుడిక గ్లాస్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. ఇక దీనిపై నిల్చుని బంగాళాఖాతం- హిందూ మహా సముద్రం- అరేబియా సముద్ర సంగమాన్ని, సూర్యోదయాస్తమానాలను తిలకించవచ్చు.