భర్త నిత్యం తాగి వచ్చి తిడుతూ కొడుతుండడంతో విసిగిపోయిందో మహిళ.. తనలాంటి బాధితురాలు ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం కావడంతో స్నేహం పెంచుకుంది. భర్తల ఆగడాలను ఇక భరించలేక ఇద్దరూ ఇంట్లోంచి వెళ్లిపోయి ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ వింత పెళ్లి గురించిన వివరాలు.. యూపీకి చెందిన మహిళలు కవిత, గుంజ అలియాస్ బబ్లూలకు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకేరకమైన సమస్యతో బాధపడుతున్నారు. వారి వారి భర్తలకు మద్యపానం అలవాటు, తాగి వచ్చి రోజూ ఇంట్లో చేసే రచ్చ చెప్పుకుంటూ బాధపడుతుండేవారు.
మద్యం మత్తులో తమ భర్తలు తిట్టే తిట్లను, పెట్టే హింసను ఇక భరించలేమని ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. భర్తలతో సంబంధం లేకుండా తామిద్దరం పెళ్లి చేసుకుని వేరే ఊరిలో కలిసి ఉండాలని కవిత, బబ్లూ డిసైడ్ అయ్యారు. ఆపై ఇద్దరూ ఇల్లు వదిలి గోరఖ్ పూర్ చేరుకున్నారు. మహిళలు ఇద్దరూ ఓ శివాలయంలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఇందులో బబ్లూ పెళ్లికొడుకులా కవిత నుదుట తిలకం దిద్దింది. ఆపై ఇద్దరూ దండలు మార్చుకుని ఏడడుగులు నడిచారు. దంపతులుగా మారిన కవిత, బబ్లూ ఇకపై గోరఖ్ పూర్ లోనే ఉంటామని, ఏదైనా పనిచేసుకుంటూ జీవిస్తామని చెప్పారు.