దేశంలో మరో ప్రాణాంతక మహమ్మారి ప్రబలుతోంది. మహారాష్ట్రలో గులియన్-బారే సిండ్రోమ్ (GBS) కేసులు వేగంగా పెరుగుతుండటంతో పూణెలో తొలి మరణం సంభవించింది. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ వివరాలను ఆదివారం వెల్లడించింది. పూణే కేంద్రంగా వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి బ్యాక్టీరియా కారణంగా ఈ మరణం సంభవించినట్లు అనుమానిస్తున్నారు.
జనవరి 9న జీబీఎస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన ఓ రోగి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. మృతుడు ఒక చార్టర్డ్ అకౌంటెంట్. మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాకు చెందిన అతను కొన్ని రోజుల క్రితమే వృత్తి రీత్యా పుణెకు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి అతనికి అనారోగ్యం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో జీబీఎస్ కేసుల సంఖ్య 101కి పెరిగింది. వ్యాధి బారిన పడిన బాధితుల్లో 68 పురుషులు కాగా.. 33 మంది మహిళలు. వీరిలో 28 మందికి ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో 16 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.
ఆందోళనకర పరిస్థితి
జీబీఎస్ లక్షణాలు ఉన్నవారిలో 19 మంది తొమ్మిదేళ్ల లోపు చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 50 నుంచి 80 ఏళ్ల వయస్సు వారిలో 23 మంది వరకు ఉన్నారు. ఆసుపత్రిలో చేరిన రోగుల శాంపిల్స్‌లో క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా ఉందని గుర్తించారు.
జీబీఎస్ ప్రభావం
జీబీఎస్ వ్యాధి శరీర రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసి, నరాలను బలహీనపరుస్తుంది. మెదడు సంకేతాలను శరీరానికి తీసుకువెళ్లే నరాలకు దెబ్బతీస్తుంది. శరీర భాగాలు చలనం లేకపోవడంతో పక్షవాతం వంటి సమస్యలు ఎదురవుతాయి. క్రమంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తాయి. వ్యాధి తీవ్రం అయినప్పుడు రోగికి శ్వాస తీసుకోవడం సమస్యగా మారుతుంది.
ప్రజలకు వైద్య నిపుణుల సూచనలు
పూణే ప్రాంతాల్లో నీటిని మరిగించి తాగాలని, ఆహారాన్ని ఉడికించి తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అధికారులు నీటి నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నారు. ఖడక్వాస్లా డ్యామ్ సమీపంలోని బావిలో ఈ.కోలి బ్యాక్టీరియా అధికంగా ఉన్నట్లు ల్యాబ్ నివేదికలో వెల్లడైంది. అయితే ఈ నీరు తాగడం వల్లే ఈ ఇన్‌ఫెక్షన్ పెరుగుతున్నట్లు స్పష్టమైన ఆధారాలు ప్రస్తుతానికి లేవు.
జీబీఎస్ చికిత్స ఖరీదు
జీబీఎస్ చికిత్స ఖరీదైనది. ఒక్కో ఇంజెక్షన్‌కు రూ. 20,000 వరకు ఖర్చు అవుతుంది. ఇమ్యునోగ్లోబులిన్ (IVIG) ఇంజెక్షన్ల కోర్సు అవసరం. పూణెలో 3 ప్రధాన ఆసుపత్రుల్లో జనవరి 10 నాటికి 26 మంది రోగులు ఉండగా, జనవరి 24 నాటికి ఈ సంఖ్య 73కి చేరింది.
ఉచిత వైద్యం
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ జిల్లా యంత్రాంగం, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో చర్చించి, జీబీఎస్ బాధితులకు ఉచిత వైద్యం అందించనున్నట్లు ప్రకటించారు.
కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందంటే..
బాధితులలో 80 శాతం మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 6 నెలల లోపు కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. కానీ కొందరికి ఏడాది లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. ఈ వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు అధికారులు వేగంగా చర్యలు చేపడుతున్నారు. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచిస్తున్నారు.