National

కీచ‌కులుగా మారిన టీచ‌ర్లు.. 13 ఏళ్ల బాలిక‌పై సామూహిక అత్యాచారం..

పిల్ల‌ల‌కు పాఠాలు చెప్పాల్సిన టీచ‌ర్లే కీచ‌కులుగా మారారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన‌ ముగ్గురు ఉపాధ్యాయులు 13 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న త‌మిళ‌నాడులో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే… త‌మిళ‌నాడు కృష్ణ‌గిరి స‌మీపంలో ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో 13 ఏళ్ల బాలిక 8వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది.

 

అయితే, గ‌త కొన్ని రోజులుగా విద్యార్థిని స్కూల్‌కి రావ‌డం లేదు. ఈ విష‌య‌మై ప్ర‌ధానోపాధ్యాయుడు, తోటి విద్యార్థినులు ఆరా తీయ‌గా దాట‌వేత ధోర‌ణితో స‌మాధానం చెప్పుకొచ్చింది. దాంతో ప్ర‌ధానోపాధ్యాయుడు విద్యార్థిని ఇంటికి వెళ్లి ఆమె త‌ల్లిని అడిగారు.

 

త‌మ కుమార్తె గ‌ర్భం దాల్చింద‌ని, అబార్ష‌న్ చేయించ‌డానికి తీసుకు వెళుతున్నామ‌ని చెప్పింది. దీనికి పాఠ‌శాల‌లో ప‌నిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు ప్ర‌కాశ్ (37), ఆరుముగం (45), చిన్న‌స్వామి (57) కార‌ణ‌మ‌ని చెప్ప‌డంతో ప్ర‌ధానోపాధ్యాయుడు నివ్వెర‌పోయారు.

 

దాంతో వెంట‌నే ఈ ఘ‌ట‌న‌పై ఆయ‌న పోలీసుల‌కు స‌మాచారం అందించి, బాలిక పేరెంట్స్ తో జిల్లా బాల‌ల భ‌ద్ర‌తాధికారుల‌కు ఫిర్యాదు చేయించారు. పోలీసులు ముగ్గురు కీచ‌క ఉపాధ్యాయుల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు