ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఎద్దేవా చేస్తూ పోస్టు పెట్టారు. ‘బీజేపీని మరోసారి గెలిపిస్తున్నందుకు రాహుల్ గాంధీకి అభినందనలు’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి 2024 లో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను కేటీఆర్ జతచేశారు. దేశంలో మోదీకి అత్యంత నమ్మకమైన కార్యకర్త ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీనే అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం ఈ వీడియోలో కనిపిస్తోంది.
మోదీని, బీజేపీని అడ్డుకోవడం రాహుల్ వల్ల కాదని తాను గతంలోనే చెప్పానంటూ కేటీఆర్ ఈ వీడియోను షేర్ చేశారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుతం బీజేపీ 42 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. అధికార పార్టీ ఆప్ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రారంభంలో బాద్లీ నియోజకవర్గంలో లీడ్ లో ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం అక్కడ కూడా వెనుకంజలో పడింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవడంపై ఆ పార్టీ వర్గాల్లోనూ సందేహం నెలకొంది.