ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయోత్సాహంలో ఉన్న బీజేపీ నాయకులు వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ లో జరుగబోయే ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని.. ఢిల్లీ తరువాత ఇక బెంగాల్ వంతు అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని హెచ్చరించారు. ముందుగా ఈ మేరకు పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి.. పశ్చిమ బెంగాల్ సిఎం, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని ‘ఇక మీవంతు’ అని హెచ్చరించారు.
కోల్‌కతాలో విలేకరులతో మాట్లాడిన సువేందు అధికారి.. ‘ఢిల్లీలో విజయం మనదే.. ఇక 2026లో బెంగాల్ వంతు వస్తుంది’ అని పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయం దేశానికి ఎంతో అవసరమని, అవినీతి, అబద్ధాల రాజకీయాల ముగింపునకు ఇది నాంది అని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, అవినీతికి పాల్పడిందని, దీనికి ఢిల్లీ ప్రజలు తగిన సమాధానం ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.
ఢిల్లీ దేశ రాజధాని అని, దీనిని అంతర్జాతీయ స్థాయి నగరంగా మార్చాల్సిన అవసరం ఉందని, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని నాశనం చేసిందని ఆయన ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో అభివృద్ధి జరిగినట్లే.. ఢిల్లీలో కూడా జరిగి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ ప్రభుత్వం యమునా ఎక్స్‌ప్రెస్ వేతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిందని.. అయితే ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం వాటిని నిర్వహించడంలో విఫలమైందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఢిల్లీలోని 90 శాతం బెంగాలీ ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని బంగ్లాదేశ్, రోహింగ్యా చొరబాటుదారులకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఆధార్ కార్డు, ఓటరు ఐడీ కార్డులను ఇవ్వడం ద్వారా ఉచిత విద్యుత్, నీరు వంటి సౌకర్యాలను అందించిందని.. ఇది దేశ భద్రతకు ముప్పు అని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఇలాంటి కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినట్లే, ఢిల్లీలో జరిగిన అన్ని దేశ వ్యతిరేక కార్యకలాపాలలో కేజ్రీవాల్ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు.
2026లో బీజేపీదే పశ్చిమ బెంగాల్.. మరో10 శాతం ఓట్లు సాధిస్తే.. : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పశ్చిమ బెంగాల్‌లో అమలు చేసేందుకు సీఎం మమతా బెనర్జీ మోకాలడ్డుతున్నారని.. పైగా రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన కోల్‌కతాలో విలేకర్లతో మాట్లాడారు.
‘‘2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకు దాదాపు 30 – 40 శాతం ఓట్లు వచ్చాయి. మరో 10శాతం సాధిస్తే.. మమతా బెనర్జీ సర్కారును సాగనంపవచ్చు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి బీజేపీపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనం. కేజ్రీవాల్ అవినీతి సర్కార్‌ను ప్రజలు తిరస్కరించారు.
గత 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజేపీ బెంగాల్ లోని 14 సీట్లలో విజయం సాధించింది. అంతకుముందు 2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీ 42 స్థానాలకు గాను 18 సీట్లు గెలుచుకొని తన ముద్ర వేసింది. అలాగే.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాల్లో గెలుపొందింది. 2019 నుంచి బీజేపీ ఓటింగ్ శాతం 30-40శాతంతో స్థిరంగా ఉంటోంది. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు మరో 10శాతం ఓట్లు మాత్రమే అవసరం. 2026లో బెంగాల్‌లోనూ గెలుస్తాం’’ అని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.