National

ఈవీఎంలోని డేటాను తొలగించవద్దు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు..

ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కూడా ఈవీఎంల నుంచి ఎలాంటి డేటాను తొలగించద్దని దాఖలైన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలను పాటిస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతానికి ఈవీఎంల నుంచి ఎలాంటి డేటాను తొలగించవద్దని, ఏ డేటాను రీలోడ్ చేయవద్దని ఎన్నికల సంఘాన్ని కోరింది. వాటిని పరిశీలించాల్సి ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికల తర్వాత డేటాను తొలగించడానికి ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తారో వెల్లడించాలని.. 15 రోజులు గడువు విధిస్తూ ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.

 

ఈవీఎంల వెరిఫికేషన్ కు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ఈవీఎంల మెమరీ/మైక్రోకంట్రోలర్‌ను పరీక్షించడం, ధృవీకరించడం కోసం మార్గదర్శకాలను జారీ చేయాలని పిటిషన్‌లో ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇది ఈవీఎంల మీద వ్యతిరేకత కాదని.. ఓడిపోయిన అభ్యర్థి స్పష్టత కోరుకుంటే.. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనే దానిపై స్పష్టత ఇవ్వచ్చని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఇదిలా ఉండగా.. ఈవీఎం ట్యాంపరింగ్ చేయపడలేదని నిరూపించలేదని ఈవీఎంలో బర్న్ చేసిన మెమొరీని, మెక్రోకంట్రోలర్ ను ఇంజనీర్ ధ్రువీకరించాలని కూడా పిటిషన్ డిమాండ్ చేసింది.

 

మరోవైపు, ఈవీఎం-వీవీ ప్యాట్ క్రాస్ వెరిఫికేషన్ అంశంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గతంలో తిరస్కరించిన విషయం తెలిసిందే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలోకి చిహ్నాలను లోడ్ చేసే ప్రక్రియ పూర్తయిన తర్వాత, యూనిట్‌ను సీలు చేయాలని ఆదేశించింది. దీన్ని కనీసం 45 రోజులు నిల్వ ఉంచాలని సిఫార్సు చేయబడింది. ఫలితాలు ప్రకటించిన ఏడు రోజుల్లోపు అభ్యర్థులు తమ అభ్యంతరాలను సమర్పించాలని పేర్కొంది.

 

విచారణ సందర్భంగా ఏడీఆర్ తరఫున హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. “సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం ఎన్నికల సంఘం అనుసరించాల్సిన విధానం ప్రామాణిక ఆపరేటింగ్ ప్రోటోకాల్ కు అనుగుణంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈవీఎంల సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ ఎవరైనా తనిఖీ చేయాలని కోరుకుంటున్నాం. తద్వారా సాఫ్ట్వేర్, హార్డ్వేర్ లో ఏదైనా ట్యాంపరింగ్ జరిగిందా లేదా అని నిర్ధారించుకోవచ్చు.”అని వివరించారు.