National

భారత్ లోకి టెస్లా..! ప్రధానితో మస్క్ భేటీ తర్వాత మారిపోయిన సీన్..

అంతర్జాతీయంగా టెస్లా కార్లతో మంచి మార్కెట్ సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్.. అతిపెద్ద ఆటోమొబైళ్ల వినియోగదారులున్న భారత్ లో అడుగుపెట్టాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోంది. కానీ.. సంస్థ ప్రణాళికలు, భారత్ లోని చట్టాలకు మధ్య పొంతన కుదరక ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న, అభివృద్ధిలో పరుగులు పెడుతున్న భారత్ వంటి మార్కెట్లోకి ప్రవేశించలేకపోయింది. కానీ.. ఇటీవల మారిపోతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో.. ఎలాన్ మస్క్ టెస్లా కార్లు భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. సుంకాల విషయంలో పరస్పరం అమెరికా – యూఎస్ కీలక అవగాహనకు వచ్చాయన్న అంతర్జాతీయ నిపుణుల అంచనాల నేపథ్యంలో.. టెస్లా నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. దేశంలో ఉద్యోగుల నియమాకానికి సంబంధించి ప్రకటన విడుదల చేసింది.

 

గతంలోనే అనేక సార్లు భారత్ మార్కెట్లోకి వచ్చేందుకు టెస్లా ఇండియా అధికారులతో చర్చలు జరిపింది. కానీ.. వేరే దేశంలో ఉత్పత్తి చేస్తుండడం, ఇక్కడకు నేరుగా ఫైనల్ ఉత్పత్తుల్ని తీసుకురావాలనే ఆలోచనలు ఎలాన్ మస్క్ చేశారు. అలా చేస్తే.. దేశీయ తయారీ వినియోగదారులు నష్టపోతారనే ఉద్దేశ్యం, దేశీయ ఉత్పత్తి రంగాన్ని పెంచాలనే సంకల్పంతో ఇండియా అందుకు అంగీకరించలేదు. ఫైనల్ ప్రొడక్టునే ప్రవేశపెట్టాలని భావిస్తే 100 శాతం పన్నులు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో.. మల్లగుల్లాలు పడుతున్న టెస్లా.. తాజాగా ట్రంప్ అధ్యక్షుడిగా మారడం, డోజ్ టీమ్ కు ఎలాన్ మస్క్ నేతృత్వం వహిస్తూ.. అమెరికా యంత్రంగంలో భాగస్వామ్యం అవడంతో.. ఇప్పుడు టెస్లాకు భారత్ మార్కెట్లు అందుబాటులోకి వచ్చాయని అంటున్నారు.

 

వాస్తవానికి గతేడాది ఎలాన్ మస్క్ ఇండియా వచ్చి ప్రధాని మోదీని కలుస్తారని అంతా అనుకున్నారు. కానీ.. చివరి నిముషంలో పర్యటన వాయిదా పడింది. ఆ తర్వాత దేశంలోనికి టెస్లా అడుగుపెడుతుందన్న ఆశలు అడియాసలయ్యాయి. కానీ ఇప్పుడు.. ఎలాన్ మస్క్ సంస్థ టెస్లా.. లింక్డ్ఇన్‌లో ఇండియా పనిచేసేందుకు వివిధ స్థాయిల్లో ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. ఆ కంపెనీ తన లింక్డ్ఇన్ పేజీలో 13 ఉద్యోగ ఖాళీలను పోస్ట్ చేసింది. ఇందులో.. కస్టమర్-ఫేసింగ్, బ్యాక్-ఎండ్ పోస్టులున్నాయి. అమెరికా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సమావేశమైన కొద్దిసేపటికే ఈ నియామకాల ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో.. మరికొన్నాళ్లల్లోనే టెస్లా కార్లు భారత్ రోడ్లపై రయ్య్ మనేందుకు సిద్ధమవుతున్నాయనే అంచనాలు పెరిగిపోతున్నాయి.

 

ఉద్యోగాలు ప్రకటనలో ఏ పోస్టులు ఉన్నాయి.

టెస్లా వివిధ విభాగాల్లో అనేక పోస్టులను భర్తీ చేయాలని చూస్తోంది. సర్వీస్ టెక్నీషియన్, అడ్వైజరీ పోస్టులతో సహా కనీసం ఐదు విభాగాల్లో ఉద్యోగుల్ని భర్తి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా.. ముంబై, దిల్లీ వంటి ప్రధాన నగరాల్లో మొదట తన కార్యకలాపాల్ని ప్రారంభించనుంది. అందుకే.. ఈ రెండు స్థానాల్లో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంప్రదించాలంటూ టెస్లా ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ఇందులో..

కస్టమర్ ఎంగేజ్‌మెంట్ మేనేజర్, డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ వంటి ఇతర విభాగాల్లో ఉద్యోగాల్ని కేవలం ముంబైలో మాత్రమే చేపట్టింది.

 

ఉద్యోగ ఖాళీలు ఇవే :

 

ఇన్‌సైడ్ సేల్స్ అడ్వైజర్

కస్టమర్ సపోర్ట్ సూపర్‌వైజర్

కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్

సర్వీస్ అడ్వైజర్

ఆర్డర్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్

సర్వీస్ మేనేజర్

టెస్లా అడ్వైజర్

విడిభాగాల అడ్వైజరీ

బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్

స్టోర్ మేనేజర్

సర్వీస్ టెక్నీషియన్

 

విశాలమైన మార్కెట్, విస్తృత అవకాశాలుండడం.. ఏటికేటా కోటీశ్వర్లు పెరిగిపోతున్న తరుణంలో భారత్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు టెస్లా ఆసక్తి చూపిస్తోంది. కానీ.. విదేశీ తయారీ కార్లపై అధిక దిగుమతి సుంకాలు ఉండటం వల్ల ఇన్నాళ్లు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అలాగే.. లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాలపై అత్యధిక దిగుమతి సుంకాలను విధించే దేశాల్లో భారత్ ఒకటి. ఇక్కడ ఏకంగా పన్నులు 110% వరకు ఉన్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులను ఆకర్షించడానికి, ప్రభుత్వం ఇప్పుడు 40 వేల యూఎస్ డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన హై-ఎండ్ కార్లపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 110% నుండి 70%కి తగ్గించింది. ఈ పరిణామంతో భారత్ లోని అవకాశాల్ని అందుకునేందుకు టెస్లా సిద్ధమైంది.

 

ఇప్పటి వరకు అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం.. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేసే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. కానీ.. ప్రపంచ పర్యావరణ సదస్సు సందర్భంగా నిర్దేశించుకున్నట్లుగా.. కర్భన ఉద్గారాల్ని తగ్గించేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా.. 2070 నాటికి పూర్తిగా హరిత ఇంధనాల వినియోగం వైపు మళ్లాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగానే.. పెద్ద ఎత్తున ఈవీ వాహనాల్ని ప్రోత్సహిస్తున్న కేంద్రం, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తగ్గించేందుకు.. చిన్నపాటి అణు విద్యుత్ ప్లాంట్ల తయారీ వైపు వేగంగా అడుగులు వేస్తోంది.