National

పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక మహిళ ఆత్మహత్య.. ఎక్కడంటే..?

మరణించిన పెంపుడు పిల్లి మళ్లీ బతుకుతుందని మూడు రోజులపాటు వేచి చూసిన మహిళ.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. మొహల్లా కోట్‌కు చెందిన పూజాదేవి (36) పదేళ్ల క్రితం వివాహం చేసుకుంది. ఆ తర్వాత రెండేళ్లకే భర్త నుంచి విడిపోయింది. అప్పటి నుంచి హసాన్‌పూర్‌లో తన తల్లి, ఇద్దరు సోదరులతో కలిసి ఉంటోంది.

 

మూడేళ్ల క్రితం రోడ్డుపై కనిపించిన ఓ పిల్లిని తెచ్చి పెంచుకుంటోంది. గురువారం అది చనిపోయింది. దీంతో దానిని తీసుకెళ్లి పాతిపెట్టేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా ఆమె అడ్డుకుంది. అది తిరిగి బతుకుతుందని వారితో వాదనకు దిగింది. అలా మూడు రోజులపాటు దానితోనే గడిపిన ఆమె శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటి మూడో అంతస్తులో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుంది.

 

ఆమె కొన్నేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతోందని, దాని నుంచి బయటపడేందుకు మందులు కూడా వాడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేకపోయిన ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. కాగా, కొన్నేళ్ల క్రిం ఆమె తండ్రి చనిపోగా, సోదరుల్లో ఒకరు మానసిక వ్యాధితో చనిపోయారు