National

తాలిబన్ల మరో వికృత చర్య.. జుట్టు అందంగా అలంకరించుకున్నా జైలుకే..!

ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్లు ఇప్పుడు పురుషులపైనా కత్తిగట్టారు. ఆధునిక పోకడలు పోయి జుట్టును అందంగా కత్తిరించుకుంటే ఇక ఊచలు లెక్కపెట్టుకోవాల్సిందే. జుట్టును అందంగా కత్తిరించుకున్న పురుషులతో పాటు, వారికి క్షవరం చేసిన క్షురకులను కూడా అరెస్ట్ చేస్తున్నారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.

 

కట్టుబాట్ల పేరుతో ఇప్పటి వరకు మహిళలపై అనేక ఆంక్షలు విధించిన తాలిబన్లు ఇప్పుడు పురుషులపైనా పడ్డారని ఐక్యరాజ్య సమితి ఆవేదన వ్యక్తం చేసింది. తాలిబన్ ప్రభుత్వంలోని ‘సదాచార, దురాచార నిరోధ మంత్రిత్వశాఖ’ చర్యల వల్ల కులవృత్తుల వారు కూడా నష్టపోతున్నారని తెలిపింది. బస్సులు, రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఎలా ప్రవర్తించాలి, క్షవరం, సంగీతం, పండుగ రోజుల్లో సందడిపై గతేడాది ఆగస్టులో ఈ శాఖ ప్రత్యేక నియమావళి విడుదల చేసింది.

 

దీని ప్రకారం.. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ముఖం చూపకూడదు. బహిరంగంగా మాట్లాడకూడదు. దీనిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం 3,300 మంది ఇన్‌స్పెక్టర్లను నియమించింది. అరెస్ట్ అయిన వారిలో ఎక్కువమంది గడ్డాన్ని నిర్దిష్ట రీతిలో కత్తిరించుకోని, క్షవరం చేయించుకోని పురుషులు, వారి క్షురకులే ఉండటం గమనార్హం. అంతేకాదు, రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా నమాజు చేయని వారిని కూడా అరెస్ట్ చేశారు. కాగా, మహిళలను విద్య, ఉద్యోగాలకు దూరం చేయడంతో ఆఫ్ఘనిస్థాన్ ఏడాదికి 140 కోట్ల డాలర్లు నష్టపోతున్నట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది.