అమ్మాయిదేమో అమెరికా.. అబ్బాయి ఉండేదేమో ఆంధ్రాలోని ఓ పల్లెటూరు. ఇద్దరి మధ్యా వేల కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దూరాన్ని ఇన్ స్టాగ్రామ్ చెరిపేసి ఆ ఇద్దరినీ కలిపింది. హాయ్ అనే మెసేజ్ తో మొదలైన పరిచయం పెళ్లి పీటల వరకూ చేరుకుంది. 14 నెలల పాటు ఆన్ లైన్ లోనే ప్రేమించేసుకున్న ఈ జంట త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. పెళ్లి కోసం తల్లితో కలిసి ఆ యువతి అమెరికా నుంచి ఆంధ్రాకు వచ్చింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని చెప్పిందా జంట. ఈ సందర్భంగా తమ ప్రేమ కథను 45 సెకన్ల వీడియోతో ఇన్ స్టాలో పంచుకుంది.
అమెరికాకు చెందిన జాక్లిన్ ఫొరెరోకు ఇన్ స్టాలో ఆంధ్రా యువకుడు చందన్ తో పరిచయమైంది. తొలుత సాధారణంగా మొదలైన చాటింగ్ రోజులు గడుస్తున్న కొద్దీ స్నేహంగా, ప్రేమగా మారింది. పద్నాలుగు నెలల తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చందన్ కంటే ఫొరెరో తొమ్మిదేళ్లు పెద్ద అయినా అదేమీ అడ్డంకి కాదని భావించినట్లు ఇద్దరూ తెలిపారు. చందన్ కు క్రైస్తవ మతంపై ఉన్న విశ్వాసం, నాలెడ్జ్ తనకు ఎంతగానో నచ్చాయని ఫొరెరో చెప్పారు. అదే తమ మధ్య పరిచయం పెరగడానికి కారణమైందన్నారు. కాగా, ఫొరెరో ఇన్ స్టాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది